ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (07:14 IST)

75శాతం స్థానికులకే ఉద్యోగాలు: జగన్‌

రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోద ముద్ర వేసింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారమిక్కడ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బోర్డు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల వల్ల పర్యావరణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతి దిశగా ముందడుగు వేయాలన్నారు.

నెల్లూరు జిల్లాలో జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌, కడప జిల్లా కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజనీరింగ్‌ కాంపొనెంట్స్‌, నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గ్రీన్‌టెక్స్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ, చిత్తూరు జిల్లాలో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ, విశాఖ జిల్లా అచ్యుతాపురం వద్ద సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమ ఏర్పాటుకు బోర్డు ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది.

సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జయరాం, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.