శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (11:23 IST)

తెదేపా కార్యకర్తలకు రూ.80 కోట్ల బీమా పరిహారం : నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తర్వాత నారా లోకేశ్ పార్టీ కార్యకర్తల కోసం ఓ బీమా సౌకర్యాన్ని కల్పించారు. అంటే, ఏదేని ప్రమాదంలో దుర్మరణం పాలైనా, గాయపడినా వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్న సదుద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ బీమా పథకం కింద రూ.80 కోట్ల మేరకు పరిహారం అందించినట్టు నారా లోకేశ్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. 
 
"తెదేపా జెండాను తమ భుజాలపై మోస్తూ, కుటుంబ సౌఖ్యాలను కూడా పక్కన పెట్టి అన్ని వేళలా పార్టీని కంటి రెప్పలా కనిపెట్టుకుని ఉంటారు కార్యకర్తలు. దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలే తెదేపాకు బలం, ధైర్యం, సైన్యం. పార్టీకి  వెన్నెముకలాంటి కార్యకర్తల కోసం ఎంత చేసినా తక్కువే. 
 
అలాంటి కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనతో తెచ్చిందే 'కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాదబీమా పథకం'. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కార్యకర్తల కోసం ఇలాంటి పథకాన్ని ఏ రాజకీయ పార్టీ తీసుకురాలేదు. 
 
ఇలాంటి ఒక పథకాన్ని పెట్టడమే కాకుండా ఎంతో చిత్తశుద్ధితో, సమర్థవంతంగా అమలుచేస్తున్న పార్టీ కూడా తెదేపానే. గత ఐదేళ్ళలో ప్రమాదాల్లో మరణించిన 4000 మంది తెదేపా కార్యకర్తల కుటుంబాలకు రూ.80 కోట్లను బీమా పరిహారంగా చెల్లించడం జరిగింది. కార్యకర్తల సంక్షేమమే మా లక్ష్యం."