శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

నాలుగు నెలల్లో 80శాతం వాగ్దానాలు అమలు.. మంత్రి అవంతి

రాష్ట్రంలో అర్హత గల ప్రతి పేదవాడి చెంతకు సంక్షేమ పథకాలను తీసుకు వెళ్తున్నట్లు పర్యాటక సాంస్కృతిక యువజన వ్యవహారాల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

గురువారం ఆయన గాజువాక ఉన్నత పాఠశాలలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు చేసి అవసరమైన కళ్ళజోళ్ళు, మందులు శస్త్ర చికిత్స ఉచితంగా చేస్తారన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పక కంటి పరీక్షలు చేయించాలి అన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి ఎవరూ ఊహించనంతటి ప్రజారంజక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని నవరత్నాలను ప్రకటించారని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించారని, వాహన మిత్ర పథకంలో ఆటోలు క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చారని కంటి వెలుగులో విద్యార్థులకు దృష్టి లోపాలను సరిదిద్దే కార్యక్రమం చేపట్టారని, 15న రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వర్గీయ వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజారోగ్య పథకాలైన 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు.

అదే బాటలో ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారని చెప్పారు. వీఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి వెలుగుకు రూ.560 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ మహిళలు, బాలల గురించి ఆలోచిస్తూ ఉంటారని రుణమాఫీ, అమ్మ ఒడి, కంటి వెలుగు లాంటి పథకాలను రూపొందించార‌న్నారు.

సంక్షేమ పథకాల అమలులో దేశాన్ని ఆశ్చర్యం చెందేలా చేస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్ట‌ర్ బి.వి.సత్యవతి మాట్లాడుతూ పిల్లలు  టీవీ సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం మూలంగా దృష్టి మాంద్యం వస్తుందన్నారు. దగ్గరగా చూడటం వల్ల మరింత ప్రభావం ఉంటుందని, ఆహారపు అలవాట్లు కూడా ఏ విటమిన్ తగ్గడానికి దోహదపడతాయని తెలిపారు.

కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత శుక్లాల  శస్త్రచికిత్సలు , గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మొదలగు కంటి సమస్యలకు ఉచిత చికిత్సలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి కంటి వెలుగు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్ తో గాజువాక హైస్కూల్లో డైనింగ్ హాల్లో నిర్మించనున్నట్లు తెలిపారు. 

 
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ కంటి వెలుగులో ఆరు రకాల నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని, చిన్నారులు, పెద్దలు నేత్ర పరీక్షలు చేసుకుని దృష్టి లోపాలను తొలగించుకోవాలని పిలుపునిచ్చారు.

అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని ఈ నెల 16 వరకు నిర్వహించే మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించి , వారికి మందులను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు.

నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు నిర్వహించే రెండవ దశలో దృష్టిలోపాలు కలిగిన విద్యార్ధులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత శస్త్ర చికిత్సలతో పాటు ఉచిత కంటి అద్దాలను  పంపిణీ మూడవ దశ క్రింద 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2022 జనవరి 31 వరకు జిల్లాలోని ప్రజలందరికీ ఉచిత సమగ్ర కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ ఉంటుందని వెల్లడించారు.

జిల్లాలో 5268 పాఠశాలల్లో 6 లక్షల 16 వేల 166 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ డాక్ట‌ర్ జి.సృజన, శాసనసభ్యులు కరణం ధ‌ర్మశ్రీ, గొల్ల బాబురావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్.తిరుపతిరావు, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ డాక్ట‌ర్ నాయక్ పాల్గొన్నారు.