1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:03 IST)

కొడుకుతో సెల్ఫీ తీసుకుంటూ వరద నీటిలో కొట్టుకుపోయిన తల్లి

మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు చిత్తూరు జిల్లాలో పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కొడుకుతో పాటు ఫోటోలు తీసుకుందామని చిత్తూరు జిల్లాలో ఓ తల్లి వాగు వద్దకు వచ్చింది. ఫోటో తీసుకుంటుండగా ఒక్కసారిగా వరదనీరు ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జల్లిపేట చెక్ డ్యాం వద్ద నీటిప్రవాహం ఎక్కువగా ఉందని గడ్డూరు కాలనీకి చెందిన మౌలా భార్య పర్వీన్ తెలుసుకుంది. గ్రామస్తులందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారని కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళింది.
 
వాగులో దిగి ఎనిమిదేళ్ళ కొడుకు హమీద్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉంది. అయితే ఉన్నట్లుండి వరద ఉధృతి పెరగడంతో కొడుకుతో పాటు ఆమె వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు మూడుగంటల పాటు రెస్య్కూ టీం గాలించి తల్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా కుమారుడి ఆచూకీ తెలియాల్సి ఉంది.