ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (08:31 IST)

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరుస ప్రమాదాలు: మాజీ మంత్రి దేవినేని

విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి అక్కడున్న చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదని, బాధితులకు న్యాయం చేస్తామని పెద్దపెద్ద కబుర్లు చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు విశాఖ వెళ్లిన ముఖ్యమంత్రి, నేరుగా వెళ్లిబాధితులను పరామర్శించకుండా, విమానాశ్రయంలో కంపెనీ ప్రతినిధులతో మంతనాలు జరపడం ద్వారా తప్పుచేసే వాళ్లకు ఏమీ కాదనే సందేశం ఇచ్చినట్టయిందన్నారు. సంఘటన జరిగిన రోజే అరెస్ట్ లు జరిగి ఉంటే, కర్నూలులో ఎస్పీవై అగ్రోస్, రాంకీ సెజ్ లో ప్రమాదం జరిగి ఉండేవి కావన్నారు.

ఏం జరిగినా ప్రభుత్వం కాపాడుతుందనే ఉద్దేశం ఉండబట్టే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఉమా పేర్కొన్నారు. మే7న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగితే, జూన్ 27న కర్నూల్లో ఎస్పీవై ఆగ్రోస్ లో ప్రమాదం జరిగిందన్నారు. ఎస్పీవై ఆగ్రోస్ లో పెద్దఎత్తున మద్యం కోసం బాట్లింగ్ పనులు జరుగుతున్నాయన్నారు.

ఆనాటి ప్రమాదంలో మరణించిన కడియాల శ్రీనివాసరావు (జీ.ఎం)ను కర్నూలు జనరల్ ఆసుపత్రికి పంపించి చేతులు దులుపుకున్నారన్నారు. ఎస్పీవైలో ప్రమాదం జరిగినప్పుడు స్థానిక మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించలేదన్నారు. జూన్ 29న విశాఖలో జరిగిన సైనార్ ప్రమాదంలో ఇద్దరు మరణించారన్నారు.

నాలుగో సంఘటనగా జూలై 13న రాంకీ సెజ్ లో జరిగిన ప్రమాదమని, దానిలో ఒకరు చనిపోతే, మరొకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. జరిగిన ప్రమాద వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణని, ఇతర టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 

వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన సెజ్ లో ప్రమాదం జరిగినా, ఎస్పీవై ఆగ్రోస్ లో ప్రమాదమైనా, విశాఖ సైనార్ ప్రమాదమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని దేవినేని ఆరోపించారు. యంత్రాంగం తన పనితాను సక్రమంగా చేసిఉంటే, వరుసబెట్టి దుర్ఘటనలు జరిగేవి కావన్నారు. సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటామని, మాక్ డ్రిల్స్ జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు.

మాజీమంత్రిని లోపలి కి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో నష్టపరిహారం కింద రూ.కోటి రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం, తరువాత జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి ఒక్క మృతుడికి కోటి రూపాయలు ప్రకటించాలని, జరిగిన ప్రమాదాలపై విచారణ జరిపి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.

ఎస్పీవై ఆగ్రోస్ లో నాసిరకం మద్యం తయారవుతోందని, అక్కడ ఏం తయారు కావాలో, దాని స్థానంలో ఏం తయారుచేస్తున్నారో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎస్పీవై ఆగ్రోస్ పై ఈ ప్రభుత్వం ఎందుకుచర్యలు తీసుకోలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

కలెక్టర్లు లాక్ డౌన్అమలుచేస్తుంటే, ప్రభుత్వ పెద్దలు అడ్డుకోవడమేంటి?:
రాష్ట్రంలో కరోనా తరుముకొస్తున్నా, ముఖ్యమంత్రిలో చలనం లేదని దేవినేని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన అమలు చేస్తుంటే, ప్రభుత్వ పెద్దలు దాన్ని అడ్డుకోవడం దారుణమని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పెద్దఎత్తున విజృంభిస్తుంటే, ముఖ్యమంత్రి, మంత్రులు నిర్లిప్తతగా ఉండటం తగదన్నారు.

రాష్ట్ర మంత్రికి కరోనా వస్తే చికిత్సకోసం హైదరాబాద్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయని, ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దేవినేని హితవు పలికారు.

ప్రభుత్వం సున్నావడ్డీ పథకం కింద జారీచేసిన జీవో నెం-464, తరువాత ఇచ్చిన మెమోలద్వారా రూ.లక్షలోపు రుణానికి మాత్రమే సున్నావడ్డీ అమలవుతుందని చెప్పడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం రూ.3లక్షల వరకు 3శాతం మాత్రమే వడ్డీ ఇస్తోందన్నారు. రూ.లక్ష లోపుకే సున్నా వడ్డీ పరిమితం చేయడం ద్వారా పైన ఒక్క వెయ్యి రూపాయలు తీసుకున్నా 7శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు.

జీవో 464, ప్రభుత్వ మెమోలు ఏం చెబుతున్నాయో, మంత్రి కన్నబాబు సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం పేరును రైతు దగా పథకంగా పేరు మార్చుకోవాలన్నారు. సున్నావడ్డీ పథకంలోని లోగుట్టు ఏమిటో, 3శాతం, 4శాతం వడ్డీలేమిటో రైతులకు అర్థమయ్యేలా స్పష్టంగా ప్రకటించాలని దేవినేని డిమాండ్ చేశారు.