సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (07:11 IST)

ఏపీలో 'అభయం' ప్రాజెక్ట్.. ఇంతకీ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. బాలలు, మహిళల భద్రత కోసం అభయం అనే సరికొత్త ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీం లో భాగంగా అభయం అనే ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.

దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు లక్ష ఆటో లను అభయం ప్రాజెక్ట్ కిందకు తీసుకురానున్నారు. ప్రతి ఆటో లోనూ అభయం అనే మొబైల్ అప్లికేషన్ ను రవాణాశాఖ అధికారులు ఇన్స్టాల్ చేస్తారు. దీనిలో ఆటో నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో లో ప్రత్యేకంగా పానిక్ బటన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటో లలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఎవరైనా ఆపద ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే.. బటన్ ను నొక్కాలి.

ఇలా బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కిన వెంటనే ఆటో నుండి హెల్ప్ అని శబ్దం రావడంతో పాటు.. కొద్దీ దూరం వెళ్ళగానే వాహనం ఆటో మ్యాటిక్ గా ఆగిపోతుంది. 
 
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సోమవారంనాడు లాంఛనంగా విశాఖపట్నంలో వెయ్యి ఆటోలతో ప్రారంభించబోతున్నారు.  మహిళలు, పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

అభయం ప్రాజెక్ట్ మొదటి విడతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన 5 వేల వాహనాలు, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి లక్ష వాహనాల్లో ఈ తరహా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.