శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శనివారం, 24 జనవరి 2015 (08:23 IST)

బిల్లు కావాలా..!... లంచం ఇవ్వాల్సిందే..!! ఏసిబికి అడ్డంగా బుక్కయిన ఇంజినీర్..

చేయి తడపందే.. బిల్లుపై పెన్ను కూడా పెట్టడు ఆ ఘనుడు. ఎంత క్వాలిటీగా చేసిన తనకు రావాల్సింది తనకు ఇవ్వాల్సిందే. ఒక వేళ పని చేయకపోయినా పర్వాలేదు. తన చేతులు తడిపి తీరాల్సిందే.. ఇలా విచ్చల విడిగా లంచాలకు మరిగిన ఓ అవినీతి ఇంజనీర్ ను ఏసిబి అధికారులు వల విసిరి పట్టుకున్నారు. కటకటాల వెనక్కి పంపారు. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఏఈగా డి.వీరాంజనేయులు వాలకమే వేరు. రెండేళ్ల కిందట మండలంలోని కరాలపాడు గ్రామానికి ఉపాధి హామీ పథకం కింద గ్రామాభివృద్ధి కోసం రూ.90 లక్షల నిధులను మంజూరయ్యాయి. ఆ పనులను వెంకటేశ్వరరెడ్డి చేస్తున్నాడు. రూ.25 లక్షల విలువైన మూడు పనులు మాత్రమే చేశారు. సకాలంలో పనులు మొదలు కాకపోవడంతో రూ.65 లక్షలు నిధులు వెనక్కి వెళ్లాయి. పూర్తయిన పనులకు సంబంధించి ఇంకా రూ.3.2 లక్షల బిల్లులు కాలేదు. వీటిని త్వరగా చేయమని వెంకటేశ్వరరెడ్డి కోరగా ఏఈ లంచం డిమాండ్ చేశాడు. రూ.25వేలు ఇస్తేనే పనులు పూర్తిచేస్తానని పట్టుబట్టాడు. ఇప్పటికే చాలా నష్టపోయానని ఎంత చెప్పినా వినలేదు. 
 
తాను అంత మొత్తం చెల్లించలేనని, రూ.15 వేలు ఇస్తానని వెంకటేశ్వరరెడ్డి చెప్పడంతో ఏఈ అంగీకరించాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని వెంకటేశ్వరరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో నిఘాపెట్టిన ఏసీబీ అధికారులు బాధితుడు తెలిపిన వివరాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. శుక్రవారం తన కార్యాలయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటున్న ఏఈని అరెస్టు చేశారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ రాజారావు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.