శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (20:04 IST)

వాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయండి: ఇంచార్జి ఆర్డీఓ రాజ్యలక్ష్మి

నూజివీడు నియోజకవర్గ పరిధిలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలనీ ఇంచార్జి రెవిన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కోవిడ్ వాక్సినేషన్, ఫీవర్ సర్వే, ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు, గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు, తదితర అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు.

ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్ట్యా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాక్సినేషన్ నూరుశాతం పూర్తి అయితేనే తప్ప వైరస్ వ్యాప్తిని అరికట్టలేమన్నారు.  నిబంధనల ననుసరించి 5 సంవత్సరాలలోపు వయస్సు పిల్లలున్న తల్లులకు, 45 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరికి వాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతీ గ్రామంలోనూ ఐసొలేషన్ కేంద్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. హోమ్ ఐసొలేషన్  సౌకర్యం లేని వారికీ ఐసొలేషన్ కేంద్రాలలో చికిత్స అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలనీ, పాజిటివ్ గా గుర్తించిన వారికి మెడికల్ కిట్లు అందించాలని, వ్యాధి లక్షణాలు తీవ్రం ఉన్న వారికీ దగ్గరలోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతీ పనిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు వ్యక్తిగతం పర్యవేక్షించాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు.

గ్రామ సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు తాను ప్రతీ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్నారు. పూర్తి అయి ఇంకా ప్రారంభంకాని భవనాల వివరాలు తెలియజేసినట్లైతే వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే  ప్రారంభించాలని,ఇందుకోసం జులై, 1, 2, 3 వ తేదీలలో జిల్లా వ్యాప్తంగా  "గ్రౌండింగ్ మేళా " నిర్వహిస్తున్నారని , ప్రతీ నిరుపేదకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న  పక్కా గృహం నిర్మాణ పనులు గ్రౌండింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు.
 
సమావేశంలో నూజివీడు నియోజకవర్గ తహసీల్దార్లు ఎం. సురేష్ కుమార్, భరత్  రెడ్డి, పాల్ , విశ్వనాధం, ఎంపిడిఓ లు జి. రాణి, భార్గవి, బి.వి. సత్యనారాయణ, నాగేశ్వరరావు, వైద్యాధికారి డా. నరేంద్ర కృష్ణ, పంచాయతీరాజ్ డి.ఈలు  జి. రఘురాం, పి. సురేష్ బాబు, డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాధ్, ప్రభృతులు పాల్గొన్నారు.