మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (12:29 IST)

యాక్టింగ్ ప్ర‌జా ప్ర‌తినిధులూ... అరెస్ట్ అయిపోతారు...త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

ఈ కాలంలో రాజ‌కీయంలో షాడోలు... యాక్టింగ్ ప్ర‌జాప్ర‌తినిధులు ఎక్కువ‌యిపోయారు. యాక్టింగ్ అంటే... అస‌లు ఎమ్మెల్యే ఒక‌రు, ఆయ‌న క‌న్నా ఎక్కువ యాక్టింగ్ చేసేది ఆయ‌న సోద‌రుడో, బావ‌మ‌రిదో... మ‌రొక‌రో ఉంటుంటారు. ఇక గ్రామాల్లో అయితే, స‌ర్పంచి మ‌హిళ అయితే, ఆమె భ‌ర్త స‌ర్పంచిలానే యాక్ట్ చేస్తుంటారు... అంతా తానై అధికారం చెలాయించే యాక్టింగ్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌భుత్వం ఇపుడు చెక్ పెడుతోంది. 
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో, కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేద‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. అలా చేస్తే, క్రిమినల్ కేసులు నమోదు అవుతాయ‌ని, అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 
గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల భార్య / భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని, అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళారు. 
దీనిపై స్పందించిన పంచాయతీ రాజ్ కమిషనర్ జిల్లాల కలెక్టర్ లకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులు అంటే వార్డ్ సభ్యులు, సర్పంచ్, ఎంపీటిసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో, కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఇలా ఎవ‌రైనా యాక్టింగ్ లా పాల్గొంటున్నారని తెలిస్తే, సంబంధిత పంచాయతీ సెక్రటరీకి తెలియ‌జేయాల‌ని, వారిపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018 - సెక్షన్ 37(5) ప్రకారం ప్రజా ప్రతినిధుల భర్త / కుటుంబ సభ్యులు / చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయ‌న్నారు. ఇలాంటి సమస్యలు ప్రజలు చూస్తే, వెంట‌నే  పంచాయతీ రాజ్ కమీషనర్, కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లవచ్చ‌ని తెలిపారు.