శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (18:55 IST)

కరోనా ఎఫెక్టు.. ఆంధ్రప్రదేశ్‌లో "ఆల్ పాస్" నిర్ణయం

దేశంతో పాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. దీంతో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఇది వచ్చే నెల 14వ తేదీ అర్థరాత్రి వరకు అమల్లో ఉండనుంది. అప్పటివరకు అత్యవసర సేవలు మినహా ఇతరసేవలు ఏవీ అందుబాటులో ఉండవు. పైగా, ప్రజలు రోడ్లపై తిరగడం లేదా గుంపులుగా ఉండకుండా ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ గొలుసు కట్టును తెగ్గొట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల్లో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను రద్దు చేసింది. దీంతో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థులంతా ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఇక ఇప్పటికే వాయిదా ప‌డిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈనెల 31న సమీక్ష నిర్వ‌హిస్తామ‌ని, ఆ త‌ర్వాతే కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. 
 
కరోనా వైరస్ కార‌ణంగా పాఠశాలలు మూతపడి ఉన్నందున పిల్లల‌కు నేరుగా ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న‌ భోజనాన్ని అందించనున్నారు. 
 
విద్యామంత్రి ప్ర‌క‌ట‌న‌కు ముందు సీఎం జగన్ విద్యాశాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనం విష‌యంలో అన్ని చోట్లా ఒకే నాణ్యత ఉండేలా చూడాలని, జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఈ సందర్భంగా సూచించారు.