గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (09:09 IST)

చివరి అంకానికి అమరావతి ఉద్యమం.. అమరావతిలో ఉద్యమ శిబిరాల తొలగింపు

amaravati deeksha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కొనసాగిన వైకాపా సర్కారు నిరంకుశ ప్రభుత్వం గద్దె దిగింది. గత ఐదేళ్లుగా నిద్రలేని రాత్రులు గడిపిన అమరావతి అన్నదాతలు.. రాష్ట్రంలో కూటమి ఘనవిజయంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యమబాటలో ఉన్న రైతులు, మహిళలకు మంచి రోజులొచ్చాయి. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో ఉద్యమాన్ని విరమించనున్నారు. 
 
రాజధాని లేని రాష్ట్రం కోసం 28,587 మంది రైతులు 34,385 ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారు. నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్న దశలో వైకాపా అధికారంలోకి వచ్చింది. వచ్చీరాగానే ప్రజావేదికను పడగొట్టి విధ్వంసానికి నాంది పలికింది. అనంతరం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి కకావికలమైంది. 
 
రాజధాని పరిరక్షణ కోసం 2019 డిసెంబరు 17న ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్విరామంగా 1,632 రోజులుగా సాగుతూనే ఉంది. తమ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసేందుకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో పాదయాత్ర నిర్వహించారు. అమరావతిని రక్షించుకునే క్రమంలో 270 మందికి పైగా రైతులు, రైతుకూలీలు మరణించారు.
 
ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రైతులకు అనుకూల పరిస్థితి వచ్చింది. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చిన తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించింది. ఇక అమరావతికి మంచిరోజులు వచ్చాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలో రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగి అమరావతి విశ్వనగరంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తమ ఉద్యమానికి ముగింపు పలకనున్నారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి నేతలు బుధవారం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఎలా ముగించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాజధాని గ్రామాల్లో ఏర్పాటైన శిబిరాలను తొలగించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం వేదికపైనే అమరావతి రైతులకు హామీ ఇచ్చి ఉద్యమం విరమింపజేస్తారని భావిస్తున్నారు.