శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

18న రాష్ట్ర పర్యటనకు వస్తున్న హోం మంత్రి అమిత్ షా.. ఎందుకో తెలుసా?

amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకురానున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకుంటారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ముఖ్య నేతలతో కలిసి భోజనం చేస్తారు. కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. 
 
రాత్రి 10.30 కు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. 19వ తేదీ ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవుతారు. 11.30కు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్టీఆర్ఎఫ్ 10వ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐ డీఎం) సౌత్ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసే సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. 
 
విభజన చట్టం ప్రకారం ఎన్ఎస్ఐడీఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. పదెకరాల ఈ ప్రాంగణంలో ప్రధాన భవనంతోపాటు శిక్షణా కేంద్రం, ఐటీ విభాగం, ఇతర అనుబంధ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఎన్ఎస్ఐడీఎం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తోంది. ఇకపై కొత్త భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది.