గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (08:50 IST)

దిబ్బలపాలెంలో దారుణం.. బెట్టింగ్ కోసం అప్పు.. తీర్చలేక విద్యార్థి సూసైడ్

suicide
ఏపీలోని అనకాపల్లి జిల్లా దిబ్బలపాలెంలో దారుణం జరిగింది. క్రికెట్‌లో బెట్టింగులు పెట్టేందుకు ఒక విద్యార్థి భారీగా అప్పులు చేశాడు. వాటిని తిరిగి తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎలుకలు మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని దిబ్బలపాలెంకు చెందిన పెంటకోట మధుకుమార్ (20) అనే యువకుడు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడిన మధు కుమార్ ఐపీఎల్‌లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
మరోవైపు మధుకుమార్‌కు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఈ నెల 23 తేదీ రాత్రి మధు కుమార్ ఎలుకల మందు సేవించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.