మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (13:26 IST)

కుమార్తె ఫీజు చెల్లించాలి.. కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి..

కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ ఆర్థికంగానేకాకుండా మానసికంగా కూడా కుంగదీసింది. అనేక మంది ఈ ఆర్థికంగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. మరికొందరు పూటగడవడం చాలా కష్టసాధ్యంగా మారడంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే, ఈ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఫీజు చెల్లించేందుకు కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా తమ కూతురు ఎంబీబీఎస్ చదువు కొనసాగించడానికి పరీక్ష పీజు కట్టేందుకు డబ్బులు లేక తమ అవయవాలను అమ్ముకోవడానికి అనుమతిని కోరుతున్నారు.. ఈ ఘటన అనంతరపురంజిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
 
అనంతరపురం జిల్లా హిందూపురానికి చెందిన మక్బుల్‌జాన్ అనే దంపతులు ఉన్నారు. వీరి కుమార్తె రుబియాను ఎంబీబీఎస్ చదివించడానికి 16 నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ పంపించారు. ప్రస్తుతం కుమార్తె వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. విదేశీ విద్యకు ప్రభుత్వం అందించే సాయంతో చదువు పూర్తి చేసుకుందని భావించి ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను విదేశాలకు పంపించారు. 
 
అయితే చదువుకోసం ఏపీ ప్రభుత్వం నుంచి ఉపకారవేతనం ఇప్పటివరకూ అందలేదు. దీంతో పిల్ల చదువుకోసం ఇల్లు అమ్మాలి అనుకున్నారు.. దానికి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో తమ కుమార్తె చదువు ఆగిపోతుందని ఆవేదన చెందిన తల్లిదండ్రులు.. చివరకు తమ కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు.
 
కూతురు ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కట్టేందుకు డబ్బుల్లేక కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు దంపతులు మొరపెట్టుకున్నారు. 
 
అంతకుముందు. తమ కుమార్తె చదువుకు ఆర్థిక సాయం అందించండి అంటూ.. మక్బుల్‌జాన్‌ గత రెండు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. ఇప్పటికే ఈ విషయంపై హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర దీక్ష కూడా చేశారు. దీంతో న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో అప్పట్లో దీక్ష విరమించారు. కానీ, ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదు.
 
ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలు రాయాలంటే ఈ నెల 17వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ, అధికారుల నుంచి ఉపకార వేతనం విషయమై ఇప్పటివరకు ఎలాంటి సమాచారమూ అందలేదని మక్బుల్‌జాన్‌ వాపోయారు. ఒకవేళ, ప్రభుత్వం స్కాలర్‌షిప్ మంజూరు చేయకపోతే.. తమ కిడ్నీలు అమ్ముకుని కూతురు ఫీజు చెల్లించుకుంటానని మక్బుల్ జాన్ పేర్కొన్నారు. 
 
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని.. లేకుంటే కనీసం తమ కుమార్తె విద్య కోసం ప్రభుత్వం సాయం చేయాలని ఆ దంపతులు ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయి.