ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం మంత్రిని మార్గ మధ్యలో ఉన్న ఆశ్రమ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో స్కానింగ్, వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పుష్పశ్రీవాణి కోలుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్పశ్రీవాణి ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎడ్ చేసిన ఈ మాజీ టీచర్ విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండో సారి గెలిచారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి భర్త ప్రోత్సాహంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన పుష్పశ్రీవాణి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. ఎస్టీ మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు.
2014 ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ తరుపున బరిలో దిగి 19,083 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈసారి 26,602 ఓట్ల ఆధిక్యతను సాధించారు. జగన్ ఈమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆమె కుటుంబం ఆ పార్టీలో సాగుతోంది.