మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (18:38 IST)

మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : విత్తమంత్రి బుగ్గన

buggana
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడివున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో చెన్నై ఇన్వెస్టర్స్ మీట్ 2023 జరిగింది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, సహజ వనరులు, అవకాశాలతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమన్నారు. సులభతర వాణిజ్యంలో ఏపీ నంబర్ వన్‌గా వుందన్నారు. 3 పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ త్వరలోనే ప్రారంభవుతాయని చెప్పారు. 
 
మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, పోర్టులు, విమానాశ్రయాలకు కొదవలేదని, చౌక రవాణా, సకల సదుపాయాలే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అని అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరులో ఫుడ్ పార్కులున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. తయారీ రంగంలో పరిశ్రమల స్థాపనకు అన్ని వసతులున్నాయని చెప్పుకొచ్చారు. 
 
పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఫార్మా రంగాల పరిశ్రమలకు చిరునామాగా ఉందన్నారు. విద్యుత్ పునరుత్పాదక శక్తిలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పర్యాటక రంగం, నైపుణ్యాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 176 స్కిల్ కాలేజీలు, 26 నైపుణ్య కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. ఇకపోతే, పాలు పంచదారలా తెలుగువారు ఎక్కడున్న స్థానికులతో కలిసిపోతారని చెప్పారు. అందువల్ల తమిళనాడు రాష్ట్రంలోని పెట్టుబడిదారులకు విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు ఇదే మా ఆహ్వానం అని చెప్పారు.
ap summitt
 
మూడు రాజధానులపై ఆయన స్పందిస్తూ, 1937లో శ్రీభాగ్ ఒప్పందం మేరకు శాసన, న్యాయ, పరిపాలన రాజధానులను మూడు వేర్వేరు ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ఒప్పందంలో ప్రధానంగా పరిపాలన, హైకోర్టు, యూనివర్శిటీలు, కృష్ణా జలాలు వినియోగాన్ని ప్రధానంగా ప్రస్తావించారన్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. ఇందులోభాగంగా కాస్మోపాలిటన్ కల్చర్‌తో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్న, అన్ని ప్రాంతాల వారు నివసించే ప్రాంతంగా ఉందన్నారు. 
 
అందుకే  ఈ ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని తెలిపారు. పైగా, అతి తక్కువ ఖర్చుతో మహా నగరంగా అభివృద్ధి చేయొచ్చన్నారు. మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తీసుకోవడంపై స్పందిస్తూ, మరింత సమగ్రంగా, మరింత మెరుగైన బిల్లును ప్రవేశపెట్టాలన్న ఏకైక కారణంతోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్నామన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ తదుపరి చర్యలు ఉంటాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
ఈ కార్యక్రమంలో ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, తమిళనాడు సీఐఐ మాజీ ఛైర్మన్ స్వామినాథన్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.