ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైకాపా సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఏపీ శాసన మండలి ఛైర్మెన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు.
అలాగే, ప్రమాణం చేసిన ఇతర ఎమ్మెల్సీల్లో అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్, ప్రకాశం జిల్లా నుంచి తుమాటి మాధవరావు, గుంటూరు జిల్లా నుంచి మురుగుడు హనుమతరావు, కృష్ణా జిల్లా నుంచి మొండితక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత సత్య ఉదయభాస్కర్, విశాఖపట్టణం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస రావు, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరి రఘురాజులు ఉన్నారు.