శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By PNR
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (16:46 IST)

వైకాపా ప్రభుత్వం అవినీతిమయం... కూకటి వేళ్లతో పెకళించి వేయాలి : ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi in ap
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో బొప్పాడులో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైకాపా, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఏపీలోని వైకాపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనన్నారు. ఈ రెండు కుటుంబ పార్టీలేనని, ఈ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందన్నారు. వైకాపాను గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. తమపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చడానికి  వైకాపా, కాంగ్రెస్ వాడుకుంటుందన్నారు. అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. అవినీతి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కూకటి వేళ్లతో పెకలించి వేయాలన్నారు. వైకాపా ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదన్నారు. గత ఐదేళ్ళలో ఏపీ అభివృద్ద కుంటుపడిపోయిందన్నారు. ఢిల్లీ, ఏపీల్లో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలోకి తీసుకుని రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్డీయే సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం మొదటి సంకల్పం కాగా, ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన తర్వాత జరిగిన తొలి బహిరం సభ ఇదేనని ప్రధాని మోడీ అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం' అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోడీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలని, అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏను గెలిపించాలని కోరారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.
 
ఎన్డీఏ అంటే పేదల గురించి ఆలోచించేదని, పేదల కోసం పనిచేసేదని మోడీ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చామన్న మోదీ, పల్నాడు జిల్లాలో 5 వేల గృహాలు ఇచ్చామని తెలిపారు. జలజీవన్ మిషన్ కింద కోటి గృహాలకు ఇంటింటికీ నీరు ఇచ్చామని, ఆయుష్మాన్ భారత్ కింద కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు అందించామని మోదీ వెల్లడించారు.
 
ఎన్డీఏలో ఉన్న ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారని ప్రధాని మోడీ కొనియాడారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారన్న మోడీ, ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేది తమ లక్ష్యమన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌ నిర్మించామని, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామని మోడీ గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యాసంస్థలు స్థాపించామని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించామని అన్నారు.
 
ఇండియా కూటమి, దానిలోని పార్టీలు పరస్పర విరుద్ధంగా పనిచేస్తుంటాయని, కేరళలో కాంగ్రెస్‌, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతారని, ఢిల్లీలో కలిసిపోతారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి పరస్పర విశ్వాసాల ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మిత్రులను వాడుకుని వదిలేస్తుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి అంటే అవసరాలకు అనుగుణంగా పరస్పరం సహకరించుకునే స్వార్థపరుల బృందం అని దుయ్యబట్టారు.