గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:42 IST)

రైతు భరోసా కింద రూ.1114 కోట్లు బదిలీ... మీ బిడ్డగా చెప్తున్నా.. సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి రైతు భరోసా. ఈ పథకం కింద రెండో విడత సాయాన్ని మంగళవారం బదిలీ చేశారు. మొత్తం రూ.1444 కోట్లను ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అర్హులైన రైతు లబ్దిదారులకు బదిలీ చేశారు. 
 
మొత్తం 50.07 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. తాము 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం అందిస్తున్నామని, ఏపీలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సాయం అందుతోందని చెప్పారు.
 
రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, వారికి రూ.11,500 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. 
 
అలాగే, పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రతి లబ్ధిదారుడికి సాయం అందిస్తున్నామని తెలిపారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, 2014లో పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకూ ఇవ్వలేదు. 2015లో ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2016 నవంబరులో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌‌లో నష్టం జరిగితే 2017 జూన్‌లో ఇచ్చారు. 2017 రబీలో నష్టం జరిగితే.. 2018 ఆగస్టులో ఇచ్చారు. 2018 ఖరీఫ్‌లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌లో పంట నష్టపరిహారం చెల్లించామని మీ బిడ్డగా, గర్వంగా చెప్తున్నా. రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు" అని చెప్పుకొచ్చారు. 
 
గత ప్రభుత్వ తీరుకు ఇప్పటికి తేడా గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు తోడుగా నిలబడుతూ.. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిసి, ఈ విషయంపై దృష్టి మరల్చే విధంగా, టీడీపీ నేతలు ట్రాక్టర్లు పట్టుకుని, తామేదో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.