శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (12:37 IST)

సార్వత్రిక ఎన్నికల్లో 'దేశం'లో వారసుల హవా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జోరు ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో చాలా పార్టీల నాయకులు తమకు బదులుగా తమ పిల్లలను బరిలోకి దించాలని ఎదురుచూస్తున్నారు. ఇలా తమ పిల్లలను బరిలోకి దించాలనుకునే వారు తెలుగుదేశం పార్టీలోనే కాస్త ఎక్కువ ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి టీడీపీ తరపున తమ పిల్లలను బరిలోకి దించాలనుకునే అభ్యర్థులు ఎవరో చూద్దాం.
 
* చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని ఈసారి తన కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు.
 
* అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకు ఈసారి తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ను పోటీకి దింపుతున్నారు.
 
* అనంతపురం జిల్లాలో గట్టి పట్టున్న మరో ఇద్దరు నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డిని, అనంతపురం ఎంపీ స్థానంలో జేసీ దివాకర్‌రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని చూస్తున్నారు.
 
* మరోవైపు కర్నూల్ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ స్థానాన్ని తన కుమారుడు టీజీ భరత్‌కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
 
* నర్సీపట్నం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సారి పోటీ నుండి విరమించుకుని తన కొడుకు విజయ్‌ను నర్సీపట్నం లేదా అనకాపల్లి నుండి బరిలోకి దించాలని చూస్తున్నారు.
 
* అనారోగ్య కారణాల వల్ల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తన కుమార్తె సుజలను నంద్యాల ఎంపీ స్థానంలో పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
* రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఈసారి తాను ఎన్నికల్లో పాల్గొనబోవడం లేదని ఇప్పటికే స్పష్టం చేసారు. ఆయనకు బదులుగా ఆయన కోడలు మాగంటి రూపను రాజమండ్రి ఎంపీ స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
* ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా వయోభారం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని భావించి తన స్థానంలో తన కొడుకు కేఈ శ్యామ్‌బాబును బరిలోకి దించుతున్నారు.