1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (11:04 IST)

ఆర్టీసీ బస్సుల్లో 'ఇంట్రానెట్ వైఫై' సౌకర్యం... గంట పాటు ఉచితం..!

దూరప్రాంత బస్సుల్లో 'ఇంట్రానెట్ వైఫై' సదుపాయాన్ని కల్పించేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. దీని సహాయంతో ప్రయాణికులు బస్సులో అందుబాటులో ఉంచిన సినిమాల్లో ఎవరికి నచ్చింది వారు చూడొచ్చు.
 
ఈ సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులోకి రానుంది. తొలుత ఈ సేవ విజయవాడ నుంచి ప్రారంభమై, హైదరాబాదు, విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత దీనిని నెమ్మదిగా విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా నడిచే బస్సులకు విస్తరించాలని ఆర్టీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ అత్యాధునిక సౌకర్యం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు గంటపాటు వైఫై సేవలను ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటును ఆర్టీ కల్పిస్తోంది. తరువాత 10 రూపాయలు చెల్లిస్తే గమ్యం చేరేవరకు ఎంతసేపైనా వైఫై వినియోగించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. 
 
ఆ ప్రకారం వైఫై కోసం బస్సులో ఓ కంప్యూటర్, వైఫై పరికరం అందుబాటులో ఉంటాయట. ఈ కంప్యూటర్ లో 50 సినిమాలు, 400 వీడియో పాటలు అందుబాటులో ఉంచుతారట. వీటిని వారివారి మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లలో వీక్షించుకోవచ్చని ఆర్టీసీ చెబుతోంది.