శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 మే 2016 (09:22 IST)

అమరావతి వెళ్లడం కంటే వీఆర్ఎస్ ఉత్తమం .. ఏపీ ఉద్యోగుల మనోగతం

హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కొత్త రాజధాని అమరావతికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. అరకొర సౌకర్యాలతో అక్కడకు వెళ్లడం కంటే.. స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుని హాయిగా హైదరాబాద్‌లోనే కొనసాగడం ఉత్తమని భావిస్తున్నారు. దీంతో ఏపీ ఆర్థిక శాఖకు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పంపుతున్న వీఆర్ఎస్ దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతోంది. 
 
ప్రధానంగా రెండు, మూడేళ్లలో రిటైర్‌ కాబోతున్న ఉద్యోగులు.. తమ కుటుంబాలు హైదరాబాద్‌లో సెటిలవ్వడం, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడటంతో వీఆర్‌ఎస్‌కి మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌ - విజయవాడ తిరగడం, తర్వాత అక్కడ అద్దె ఇల్లు తీసుకొని ఉండడం కంటే హాయిగా రిటైర్మెంట్‌ తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. తాత్కాలిక రాజధానికి ఉద్యోగులు దశలవారీగా తరలివెళ్లాలని ప్రకటించిన నాటి నుంచి ఈ తరహా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు మొదలయ్యాయని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 
ప్రభుత్వం చెప్పిన ప్రకారం జూన్ 15వ తేదీ నాటికి ఉద్యోగుల మొదటి దశ తరలింపు ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఆ సమయానికి వీఆర్‌ఎస్‌ దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత అంటే ఆగస్టు 15వ తేదీన ఉద్యోగుల మూడో దశ తరలింపు పూర్తి చేయాల్సి ఉంది. ఆ సమయానికి ప్రతి శాఖ నుంచి కొంతమంది ఉద్యోగులను హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ప్రభుత్వం ఉంచే ఆ కొద్ది మంది సిబ్బందిలో తాము ఉండేలా మరికొంతమంది ఉద్యోగులు ఇప్పటినుంచే పైరవీలు చేస్తున్నారు.