1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (18:34 IST)

స్థానికత పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న కేసీఆర్ : రావెల కిషోర్

ఉద్యోగుల స్థానిక అంశాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ ఆరోపించారు. 1956 కటాఫ్‌పై తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో చదివే ఆంధ్రా విద్యార్థులకు ఏపీ ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. స్థానికత పేరుతో ఇబ్బందులు పెడితే సహించేది లేదని కోర్టును ఆశ్రయిస్తామని మంత్రి చెప్పారు. 
 
ఆయన ఆదివారం చిత్తూరు జిల్లా, రేణిగుంట తిరుపతిలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 రోజుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్‌ను ఆదేశించారు. 1956కు ముందు ఖమ్మం జిల్లా సగం లేదని, అలాగే మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు లేవని అన్నారు. ఆలోచించకుండా కేసీఆర్ పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. 
 
ఈ నాలుగు జిల్లాలు 1956కు ముందు మద్రాసులో కలిసి ఉండేవని, ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఆ నాలుగు జిల్లాలు నాన్ లోకల్ కిందకు వస్తాయని ఆయన అన్నారు. 1956 విధానాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఒకేవేళ హైదరాబాద్‌లో చదివే ఆంధ్రా విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వనంటే తమకు అభ్యంతరం లేదని, తామే కడతామని రావెల కిషోర్ స్పష్టం చశారు.