శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (18:32 IST)

క్వారంటైన్‌కు సిద్ధపడితే రండి లేదా భోజనం పెడతాం సరిహద్దుల్లో ఉండండి : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో 13కు చేరాయి. మరికొందరి రిపోర్టులు రావాల్సివుంది. తాజాగా అధికార పార్టీకి చెందిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపై సీఎం జగన్ శనివారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ సరిహద్దుల్లో ఉండేవారు 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధ పడేవారిని రాష్ట్రంలోని అడుగుపెట్టనివ్వాలని కోరారు. 
 
నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తగ్గట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని... ఆ తర్వాత వాటి కొనుగోలు సమయాన్ని తగ్గించాలని చెప్పారు. కరోనా బాధితుల చికిత్స కోసం స్వచ్ఛందంగా వచ్చే  వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించాలని చెప్పారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌కు తరలించాలని, ఇందులో ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించవద్దని సీఎం అధికారులను కోరారు.