మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (17:26 IST)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

rain alert
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి, గంటలకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని పేర్కొంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలపడి రేపటికి తుపానుగా మారే అవకాశం ఉందని, రానున్న రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో, ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో అధికారులు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.