గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 14 అక్టోబరు 2016 (21:16 IST)

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

పర్యాటక, ఆతిధ్య రంగాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం మిషన్, టూరిజం పాలసీలను రూపొందించింది. అపారమైన 974 కిలోమీటర్ల సముద్ర తీరం, కేరళను మించిన సుందరమైన ప్రదేశాలున్న మన రాష్ట్రంలో ఈ రంగంలో పెట్టుబడులకు, ఉపాధికి అవకాశాలు పుష్కలం

పర్యాటక, ఆతిధ్య రంగాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం మిషన్, టూరిజం పాలసీలను రూపొందించింది. అపారమైన 974 కిలోమీటర్ల సముద్ర తీరం, కేరళను మించిన సుందరమైన ప్రదేశాలున్న మన రాష్ట్రంలో ఈ రంగంలో పెట్టుబడులకు, ఉపాధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే పర్యాటకులను ఆకర్షించడంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా ఉంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ దాదాపు 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక రచన చేసి ఈ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. మౌలిక వసతులు, వాణిజ్యానికి అనుకూల వాతావరణ కల్పిస్తూ  పెట్టుబడిదారుల స్నేహశీలగా పేరొందిన ఏపీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. 
 
2020 నాటికి రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, అదనంగా మరో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెట్టుబడులతోపాటు ప్రైవేటు, పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టర్నర్ షిప్) పద్దతిలో పెట్టుబడులు రాబట్టడానికి ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  ఇటీవల ఢిల్లీలో జరిగిన టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలను కోరారు. పర్యాటక రంగం అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచడంతోపాటు కేంద్రం నుంచి నిధులు (సీఎఫ్ఏ- సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్) రాబట్టాలన్న ఆలోచనతో ఉంది.
 
2014లో రాష్ట్రంలో పర్యటించిన దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య 9,33,73,307 ఉండగా, 2015లో 12,18,28,908కి పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే 9,69,96,009 మంది పర్యటించారు. ఈ సంఖ్య 2020 నాటికి 17 కోట్ల 13 లక్షలకు చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని దానిని ఇంకా విస్తృత పరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టూరిజం మిషన్‌-2014, టూరిజం పాలసీ-2015ని రూపొందించింది. వాటి ప్రకారం ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.   పెట్టుబడులు, ఉపాధికి అవకాశాలు ఉన్న పలు టూరిజం ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం  సిద్ధంగా ఉంది.
 
తీర ప్రాంతంపై దృష్టి
పర్యాటక, ఆతిధ్య రంగాల అభివృద్ధిలో భాగంగా సముద్ర తీర ప్రాంతాలలో ఇప్పటికే ప్రముఖ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాలతోపాటు మరుగునపడిన వాటిని, కొత్త ప్రదేశాలను అభివృద్ధి పరుస్తారు. విశాఖ జిల్లాలోని రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, యరవాడ బీచ్, భీమునిపట్నం బీచ్, కొండకర్ల అవా బీచ్, గంగవరం బీచ్,  కాకినాడలోని ఉప్పాడ బీచ్, కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్,  గుంటూరులోని సూర్యలంక బీచ్,  ప్రకాశం జిల్లాలోని ఓడరేవు, రామాపురం బీచ్, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ వంటి వాటిని సుందరంగా, అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ని కూడా అభివృద్ధి చేస్తారు.  పర్యాటకుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాలలో రిసార్ట్స్ ను ఏర్పాటు చేస్తారు. విజయవాడ భవానీద్వీపం, అఖండ గోదావరిలోని ద్వీపాలలో పర్యటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవానీ ద్వీపం, కృష్ణా రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్లను నియమించుకోవాలన్న ఆలోచన ఉంది. ఐఎన్‌ఎస్ విరాట్ రాకతో రాష్ట్ర పర్యాటక రంగం ఊపందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.  టూరు ఆపరేటర్లకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  
 
పర్యాటకులు ప్రకృతి రమణీయ సుందర ప్రదేశాలను తిలకించడంతోపాటు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే పిండి వంటలు, ఆహార పదార్థాల రుచులు చూసే అవకాశం కూడా కల్పిస్తారు.  విజయవాడ ఉలవచారు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ, ఆత్రేయపురం పూతరేకులు, గోదావరి పులస చేప వంటి వంటకాలను అంతర్జాతీయంగా బ్రాండింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రంగంలో ఛెఫ్‌లను తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 
 
పర్యాటకుల విడిదికి ఏర్పాట్లతోపాటు, ఆతిధ్యం కూడా వారు మరచిపోలేని విధంగా ఉండటానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 39 ప్రాజెక్టులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది.  సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 164.33 కోట్ల వ్యయంతో 9 జెట్టీల నిర్మాణానికి ఏపీ రాష్ట్ర వాటాగా రూ.82.15 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.  
 
గగన తల పర్యాటకం
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంలో భాగంగా మరో కొత్త ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గగనతల పర్యాటకం (హెలిటూరిజం)ను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో దీనిని ప్రవేశపెడతారు. ప్రయోగాత్మకంగా గోదావరి పుష్కరాల్లో తొలిసారిగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. రాజమండ్రిలో పర్యాటక విశేషాలను హెలికాప్టర్‌లో వెళుతూ వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అక్కడి పుష్కర ఘాట్లన్నీ ఆకాశమార్గంలో తిలకించే ఏర్పాటు చేశారు.  ఆ తరువాత కృష్ణా పుష్కరాల సమయంలో కూడా భక్తులకు ఈ సౌకర్యం కల్పించారు. 
 
సాగర తీర రిసార్టులను అభివృద్ధి చేసి, ఆయా ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను ప్రవేశపెడతారు. ఆకాశదీపాల పండగ, సైకత శిల్పాల ప్రదర్శన, ప్రత్యేక రకాల పుష్పాల ప్రదర్శన, లేజర్‌ ప్రదర్శన, బాణాసంచా వెలుగులతో పుష్కర యాత్రికులకు మధురానుభూతులను పంచేందుకు పర్యాటకశాఖ ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. విశాఖను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయనున్నారు. 
 
పర్యాటకం, సంస్కృతి, వారసత్వ సంపద కోసం ప్రత్యేక బోర్డు 
పర్యాటక రంగ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు, వారసత్వ సంపదను కాపాడటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతి, వాసరసత్వ సంపద బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. మిగిలిన రాష్ట్రాల కంటే ఆకర్షణీయంగా వుండేలా రాష్ట్ర పర్యాటక విధానంలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపీటీడీసీ(ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) స్థానంలో స్వయం ప్రతిపత్తి గల స్వతంత్రంగా పనిచేసే బోర్డును ఏర్పాటు చేస్తే పర్యటక రంగం అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు సింగపూర్, శ్రీలంక, మలేసియా తరహాలో ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
 
సింగపూర్ లో పర్యాటక రంగానికి అత్యున్నతస్థాయిలో మంత్రిత్వశాఖ ఉంది.  దాని కింద బోర్డు, బోర్డు పరిధిలో అథారిటీస్ పనిచేస్తున్నాయి. మలేసియా, శ్రీలంకలలో కూడా ఇటువంటి సంస్థాగత నిర్మాణమే వుంది. ఆయా  బోర్డుల నిర్వహణా విధానాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఉత్తమమైన విధానాలతో బోర్డు నియమ నిబంధనలను రూపొందిస్తారు.  సంస్కృతి, పురావస్తు, వారసత్వ సంపద, పర్యాటకం, ఆహారం, ఆతిధ్యం తదితర శాఖలను అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా ఈ బోర్డును ఏర్పాటు చేస్తారు. దేశంలో చత్తిస్‌గఢ్, ఉత్తరాంచల్, పంజాబ్‌ రాష్ట్రాలలో ఈ తరహా పర్యాటక బోర్డులను ఏర్పాటుచేశారు. బోర్డు ఏర్పాటు  ద్వారా ప్రభుత్వ ప్రణాళికలను శీఘ్రగతిన అమలుచేయడం, సామర్ధ్యం పెంపు, నైపుణ్యాల మెరుగుదల, జవాబుదారీతనం, మార్కెట్ క్రెడిబులిటీ, బ్రాండింగ్ తదితర ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది.  రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బోర్డు ఏర్పాటు చేస్తారు.
 
జిల్లా, నగర స్థాయిలో పర్యాటక మండలిలను  ఏర్పాటు చేస్తారు. పరిమిత స్థాయిలో వుండే పర్యాటక ప్రాజెక్టులపై జిల్లా, నగర పర్యాటక మండళ్లు నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక స్థాయికి మించిన ప్రాజెక్టులపై రాష్ట్రస్థాయి మండలి నిర్ణయాలు తీసుకుంటుంది.  రాజమండ్రి, అమరావతి, తిరుపతి, విశాఖ నగరాలలో నగర పర్యాటక మండలిలలను ఏర్పాటుచేసే ఆలోచన ఉంది. ఈ రకమైన వ్యవస్థను రూపొందించడానికి  ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందిస్తారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, ఈ విషయంలో అందరిలో చైతన్యం తీసుకురావడం, వారసత్వ సంపదను భావితరాలకు అందించడం వంటివి ఈ బోర్డు ప్రధాన విధులుగా వుంటాయి. ఈ బోర్డు విధివిధానాలు, చట్టం రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. 
 
అవసరమైతే  రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి ఈ రంగాన్ని అభివృద్ధిపరచాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది.  తెలుగు కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా అమరావతిలో 20 నుంచి 25 ఎకరాల్లో శాశ్వత వేదిక ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.  అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ సాంస్కృతిక నగరంగా దీనిని తీర్చిదిద్దుతారు.  పర్యాటక రంగం పరంగా ప్రతి జిల్లా తన ప్రత్యేకతను చాటుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.