నాకు జగన్ పైన నమ్మకం లేదు, ఉపముఖ్యమంత్రిని తొలగించండి: వైద్యురాలు అనితారాణి
వైజాగ్‌లో వైద్యుడు సుధాకర్ వ్యవహారం మరువక ముందే చిత్తూరు జిల్లాలో అనితారాణి వ్యవహారం తెరపైకి వచ్చింది. క్రిందిస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే వైసిపి నాయకులను వెంటేసుకుని వచ్చి తనపై దుర్భాషలాడారని, కేసు పెట్టినా దళితురాలిని కావడంతో పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది అనితారాణి.
అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి హామీపై తనకు నమ్మకం లేదని.. సిఐడి కాదు సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు అనితారాణి. అంతేకాకుండా తనను దూషించిన వైసిపి కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు.
బాత్రూంకు వెళ్ళిన తనను వీడియోలు తీశారని.. అసభ్యంగా ప్రవర్తించారని దీనిని ప్రశ్నించాల్సిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం కాస్త తీవ్రస్థాయిలో చర్చజరుగతోంది.