1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (12:35 IST)

ఏపీ త్వరలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రకటన

ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు త్వరలో ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఇంటి నుంచే ఎంపిక చేసుకోవచ్చు.

ఒక్కొక్కరు ఎన్ని కళాశాలలకైనా ఐచ్ఛికాలను ఇచ్చుకోవచ్చు. ఈసారి ప్రవేశాల్లో ప్రైవేట్‌ సహా అన్ని జూనియర్‌ కళాశాలల్లోనూ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో కళాశాలలను ఎంచుకునే సమయంలోనే వాటిలో ఉండే మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలు కనిపిస్తాయి.

విద్యార్థులు కేవలం తమ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. ఎన్‌సీసీ కోటా వారు మాత్రమే ధ్రువపత్రాలను స్కానింగ్‌ చేసి, జతపరచాలి. గతేడాది రుసుములతోనే ప్రవేశాలు నిర్వహించాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

నిరుడు ప్రైవేటు కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.3,119, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.3,432లను రుసుములుగా నిర్ణయించింది. కొత్త బోధన రుసుములను నిర్ణయించే వరకు ఈ మొత్తాన్నే వసూలు చేయాల్సి ఉంటుంది.