మెట్రో జర్నీ కాదు.. మృత్యు ప్రయాణం ... పట్టుకుంటే ఊడివచ్చిన రోప్ క్యాబిన్
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. నిత్యం ఏదో ఒక అపశృతి చోటుచేసుకుంటుంది. దీంతో ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని మెట్రోలైన్ కారిడార్-1 ఎల్‌బీనగర్-మియాపూర్ మార్గంలో శనివారం ఉదయం ఊహించని ఘటన ఒకటి జరిగింది. రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మెట్రో రైలు ఎంతో సురక్షితమని ఓవైపు ప్రభుత్వంతో పాటు మెట్రో రైల్ యాజమాన్యం పదేపదే చెబుతున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటం ప్రయాణికులను ఆశ్యర్యానికి లోనుచేస్తోంది. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో శ్లాబ్ పెచ్చులూడి మీద పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే.