గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (15:15 IST)

ఓట్ల కోసం పసుపు కుంకుమ, ఉప్పు కారం, పప్పు బెల్లం.. ఏదంటే అది...

అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయకుండా.. ఇప్పుడు రుణమాఫీ చేస్తారా లేదా అంటూ తమని ప్రశ్నించటం ఏంటని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం శాసనసభలో రైతు రుణ మాఫీపై నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావులు అడిగిన ప్రశ్నలపై మంత్రి మాట్లాడారు. 
 
చిత్తశుద్ధిలేని శివపూజలు ఎందుకు అన్నట్లు టీడీపీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. రైతుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే వాళ్లు ఇచ్చిన హామీని ఐదేళ్లలో నెరవేర్చి ఉండేవారు. వారు ఐదేళ్లలో నెరవేర్చలేక ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని కన్నబాబు అన్నారు. 
 
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600కు పైగా హామీల్లో రుణమాఫీ ఒకటని క‌న్న‌బాబు అన్నారు. నిజానికి అప్పుడు వ్యవసాయ రుణమాఫీకి రూ.87 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే రకరకాల కమిటీలు వేసి.. దాన్ని రూ.24 వేల కోట్లకు తీసుకువచ్చారని క‌న్న‌బాబు గుర్తు చేశారు. 
 
చివరకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లోరుణ మాఫీకి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చూస్తే 16,512 కోట్లు ఉంటే..  రైతులకు రూ.15,279 కోట్లు ఇచ్చింద‌ని అన్నారు. రుణ‌మాఫీ 4, 5 విడతల్లో రూ.7,488 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆ అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని క‌న్న‌బాబు అన్నారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల ఐదేళ్లలో తమకు ఇస్తామన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న రైతుల్లో వస్తోంది.

తాను(చంద్రబాబు) ఇచ్చిన హామీ మేరకు కూడా రుణ మాఫీ చేయకుండా... పసుపు పచ్చ పత్రాలు తయారు చేసి దీనికి ఎటువంటి కాలప‌రిమితి (వ్యాలిడిటీ) కూడా ఇవ్వలేదు. పార్టీ కరపత్రం మాదిరిగా దీన్ని రైతుల చేతుల్లో పెట్టి 4, 5 విడతల్లో డబ్బు ఇస్తామని టీడీపీ నేత‌లు చెప్పారు. మరి, డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయారు. రూ.7,000 కోట్లకు జీఓ ఇచ్చారని ఓ సభ్యుడు చెప్పగా... ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టొచ్చో ఈ జీఓ చూస్తే తెలుస్తుందని కన్న బాబు తెలిపారు. 
 
మార్చి 10, 2019 సాయంత్రం 5 గంటలకు ఈ జీఓ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ జీఓ ఇచ్చిన మర్నాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నిజంగా ఇచ్చే ఆలోచనే ఉంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే 24 గంటల ముందు నోటిఫికేషన్ ఇస్తారా అని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. చేసింది అంతా చేసి ఎదుటివారి మీద తప్పు తోసేయటం టీడీపీ నేత‌ల‌కు అలవాటు అయిపోయిందని క‌న్న‌బాబు మండిప‌డ్డారు. చంద్ర‌బాబు రుణమాఫీ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆలస్యం అయితే వడ్డీ కూడా ఇస్తామని చెప్పారు. మ‌రి, రుణ‌మాఫీ పూర్తి కాకుండానే అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎన్నికలకు రెండు నెలల ముందు ఎందుకు తెచ్చారు. 
 
రుణ‌మాఫీకే డబ్బులు లేవు. మ‌రి, ఎక్కడ నుంచి డబ్బులు తెద్దాం అనుకున్నారని కన్నబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా పసుపు కుంకుమ, ఉప్పు కారం, పప్పు బెల్లంలా.. ఏదంటే అది ఆరోజుకు ఓట్లు వస్తాయంటే ఆ కార్యక్రమం తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు పాలన ప్రజలు మర్చిపోతారని అప్పటికప్పుడు  తీసుకువచ్చారు. చేసిన తప్పలకు వాళ్లు మూల్యం అనుభవిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అని ముందు రోజు తెస్తే రైతులు ఓట్లేయరు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీరిచ్చిన హామీలు జగన్ నెరవేర్చుతారా? లేదా? అని ఎలా అడగగలుగుతున్నారని కన్నబాబు సూటిగా నిలదీశారు. 
 
ఇదేవిధానం మున్ముందు ప్రభుత్వాలను కొనసాగిస్తే ఎలా? పసుపు పచ్చ కాగితాలు పంచితే ఏమౌతుందని ప్రశ్నిస్తారు. 
చివరికి, రైతులకు విత్తనాల పంపిణీ చేయటానికి అవసరమైన బకాయిలు రూ.384 కోట్లు ఇవ్వలేదు. పౌరసరఫరాల శాఖ మంత్రి చెప్పినట్లు ధాన్యం కొనుగోలు చేయటానికి తీసుకువచ్చిన డబ్బులు రూ.408 కోట్లు డైవర్ట్ చేశారు. వ్యవసాయ శాఖలో డబ్బులు కూడా డైవర్ట్ చేశారంటే మీ చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతోంది. 
 
రుణ‌మాఫీ బకాయిల అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉంద‌ని దీనిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలో నిర్ణయం తీసుకోవ‌టం జ‌రుగుతుంద‌ని కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. వాటిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడిగే అధికారం టీడీపీకి ఎక్కడుందని క‌న్న‌బాబు నిలదీశారు. కనీసం రైతులకు విత్త బకాయిలు కూడా టీడీపీ చేయలేదని క‌న్న‌బాబు మండిపడ్డారు.