శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (19:51 IST)

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలన్నింటిలోను ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది.
 
ఈ సందర్భంగా వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు.

ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో సీఎం జగన్‌ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నమే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు మొదలుపెట్టారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాలు
1. ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలకు కేబినెట్ ఆమోదం:
ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, పునర్విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.2 లక్షల వరకు కనీస జరిమాన, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కేబినెట్ నిర్ణయించింది.

అంతేగాకుండా ఇసుక విధానాన్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గనుల చట్టంలో సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక లభ్యత కోసం ప్రభుత్వం నవంబర్ 14 నుంచి వారోత్సవాలు నిర్వహించనుంది.

రోజుకు 2 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 10 రోజుల్లో ఇప్పటివరకూ ఉన్న ఇసుక కొరతను పూర్తిగా తీర్చాలని నిర్ణయించింది.
 
 
2. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ మేనేజిమెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం :
కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ మేనేజిమెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పారిశ్రామిక వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాల సేకరణ, రవాణా, నిల్వ,శుద్ధి నిర్వహణపై ఏపీఈఎంసీ పని చేయనుందని తెలిపింది. రాష్ట్రంలో 9 వేల పరిశ్రమలుండగా అందులో 2 వేల పరిశ్రమలు రెడ్ కేటగిరిలో ఉన్నాయని కేబినెట్ నిర్ణయించింది.
 
2683 పరిశ్రమల నుంచి ఏడాదికి 5,56,317 టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయని, ఇందులో 2,11,440 టన్నులు డిస్పోజబుల్ వ్యర్థాలని పేర్కొంది. 3,13,217 టన్నుల రిసైక్లబుల్ వేస్ట్ అని, 31,659 టన్నులు ఇన్ క్రెడిబుల్ వేస్ట్ అని కేబినెట్ తెలిపింది. 196.3 ఎంఎల్ డీ కలుషిత జలాలుగా పేర్కొంది.

రాష్ట్రంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థీకృతంగా లేదని గుర్తించిన ప్రభుత్వం శుద్ది చేసేందుకు తగిన వ్యవస్థ అవసరమని గుర్తించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో 9,30,000 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రం, నెల్లూరులో 95,000 టన్నులు శుద్ధి చేసే కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది.

వ్యర్థాలకు కారకులైన వారు బాధ్యత వహించడంలో లోపాలను నివారించడానికి, అక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను డిస్పోజ్ చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టడానికి, వ్యర్థాలను తీసుకెళ్తున్న వాహనాలను సరిగ్గా ట్రాక్ చేయాలని నిర్ణయించింది.

ఒక పరిశ్రమ పేరుతో వ్యర్థాలను సేకరించి, మరో పరిశ్రమ పేరుతో డిస్పోజ్ చేయడాన్ని నివారించడానికి, రికార్డుల్లో చెప్పినదానికన్నా ఎక్కువ మొత్తం వ్యర్థాలను డెలివరీ చేయడాన్ని అడ్డుకోవడానికి, పరిశ్రమల్లో విడుదలవుతున్న వ్యర్థాల పరిమాణాల నిర్ధారణకు సరైన ప్రయోగశాలలు ఉండేలా చూడ్డానికి పై అంశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ మేనిజిమెంట్ కార్పొరేషన్ డీల్ చేస్తుందని కేబినెట్ తెలిపింది.
 
3. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనకు కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం :
వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన తరగతుల్లో ఒక్కొక్క ఏడాదీ ఒక్కో తరగతి చొప్పున ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కోసం తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, మేధావుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ 37.21 లక్షల మంది చదువుతుంటే ఇందులో 3,265 సక్సెస్ హైస్కూల్లో సమాంతరంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది.

11,37,043 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసిస్థున్నారని కేబినెట్ దృష్టికి వచ్చింది.  ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 98.5 శాతం స్కూళ్లు ఇంగ్లీష్ మీడియంలో ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 34 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉందని పేర్కొంది.
 
4. సముద్రంలో  వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా పెంపుకు కేబినెట్ ఆమోదముద్ర :
నవరత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మరో హామీ అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో  వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు  పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  ఈ మొత్తాన్ని మత్స్యశాఖ ద్వారా అందిస్తామని తెలిపింది.
 
18 నుంచి 60 సంవత్సరాల వయస్సులోపు కలవారై వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న వారికి “వైఎస్సార్ మత్స్యకార భరోసా” వర్తిస్తుందని కేబినెట్ తెలిపింది. తద్వారా 4,05,357 మందికి ఈ నిర్ణయం వర్తించనుంది.
 
 
5.పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అనధికారిక లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు-2019కు  మంత్రి వర్గం ఆమోదం :
గడిచిన కొన్నేళ్లుగా గ్రామాల నుంచి నగరాలకు పెద్ద ఎత్తున వలసలు వెళ్లడం జరిగిందని, దీని వల్ల నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు ఆనుకొని పెద్ద ఎత్తున ప్లాట్లు వెలిశాయి. వీటిలో చాలా వరకు అనుమతులు లేవని కేబినెట్ భావించింది.

అనుమతులు లేని కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ లాంటి మౌలిక వసతులు కల్పించడం కష్టతరం అయిన నేపథ్యంలో తమ ఇబ్బందులు తీర్చమని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని కేబినెట్ తెలిపింది.

ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ నిబంధనలు-2019కి ఆమోదం తెలిపింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ వల్ల మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల కొనుగోలుకు రుణసదుపాయం లభించడం సులభమవుతుందని కేబినెట్ భావించి నిర్ణయం తీసుకుంది.
 
 
6. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్ విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ పాలసీ-2018 సవరణకు కేబినెట్ ఆమోదం
 
7. రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం :
రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం  తెలిపింది. అందుకనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం -2018 సవరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

వివాదాల సత్వర పరిష్కారానికి 2009 లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ న్యాయాలయాల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించారని కేబినెట్ గుర్తుచేసింది.
 
8. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం
9. హోంశాఖలో అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ :
1–డైరెక్టర్, 3 డిఎఫ్‌ఓ ర్యాంకుతో అసిస్టెంట్‌ డైరెక్టర్ల పోస్టుల కొనసాగింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన వల్ల డైరెక్టర్ పోస్టు తెలంగాణ ప్రాంతానికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో డైరెక్టర్ పోస్టు లేని కారణంగా ఆయా పోస్టులను నియమించుకోవాలని అగ్నిమాపక శాఖకు అనుమతులిస్తూ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
 
10. రాష్ట్రంలోని 8 దేవస్ధానాలకు ట్రస్ట్‌ బోర్డు మెంబర్ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం:

రూ.21 కోట్లు పైబడి రాబడి కలిగిన రాష్ట్రంలోని 8 దేవస్ధానాలకు ట్రస్ట్‌ బోర్డు మెంబర్ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  సేవాధక్పధం, ధార్మికదష్టి, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులను ట్రస్ట్‌ బోర్డు మెంబర్లగా నియామకానికి కేబినెట్‌ నిర్ణయించింది.

అందులో భాగంగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్ధానం- సింహాచలం, శ్రీ వీరవెంటక సత్యన్నారాయణ స్వామి దేవస్ధానం – అన్నవరం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్ధానం – ద్వారకా తిరుమల, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం – విజయవాడ,శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి దేవస్ధానం – శ్రీకాళహస్తి, శ్రీ భ్రమరాంభా మల్లేశ్వరస్వామి దేవస్ధానం– శ్రీశైలం, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్ధానం – పెనుగంచిప్రోలు, శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి దేవస్ధానం– కాణిపాకం దేవాలయాలు ఈ పరిధిలోకి రానున్నాయి.
 
11. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ లా చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదముద్ర :
 
12. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం:
మొక్కజొన్న ధరలు పడిపోతుండడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
 వారంరోజుల క్రితం క్వింటాలు ధర రూ.2200 ఉండేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కేబినెట్ లో ప్రస్తావించారు. వారం రోజుల్లో రూ.1500కు మొక్కజొన్న ధర పడిపోయిందన్న విషయాన్ని కేబినెట్ ముందు వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు.

రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధర రూ.1750 కి తగ్గకుండా రైతులకు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ముఖ్యమంత్రి సూచించారు.

మార్కెటింగ్‌ శాఖద్వారా రైతులకు నష్టంరాకుండా కొనుగోళ్లు జరపాలని సీఎం తెలిపారు. సీఎం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మధ్యాహ్నం నుంచే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు చేస్తున్నారు.