శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (10:48 IST)

అమరావతి శంకుస్థాపనకు భారీ ప్లానింగ్.. చరిత్రలో నిలిచిపోయేలా...

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్లానింగ్ చేసింది. ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా కనిపించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులనూ ఆహ్వానించనుంది. అలాగే, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అత్యంత ప్రభావశీల వ్యక్తులు, పారిశ్రామిక వేత్తలను కూడా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించనుంది. 
 
నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలోనూ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి కలశాలతో మట్టిని తెచ్చి దాన్ని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మిళితం చెయ్యాలనే ఆలోచనలో ఉంది. శంకుస్థాపన జరిగే ప్రాంతంలో భారీ పైలాన్ నిర్మించాలని, ఆ ప్రాంతాన్ని టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. 
 
మరోవైపు శంకుస్థాపన కార్యక్రమాల పర్యవేక్షణకు నాలుగు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. నిర్వాహణ కమిటీ, రిసెప్షన్‌ కమిటీ, వేదిక కమిటీ, మీడియా సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 23 మంది సభ్యులతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వాహణ కమిటీ ఏర్పాటైంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన రిసెప్షన్‌ కమిటీ, వేదిక కమిటీ పనిచేయనున్నాయి. 
 
ఐదుగురు సభ్యులున్న రిసెప్షన్‌ కమిటీ అందరికీ ఆహ్వానాలు పంపడం, అతిథులకు స్వాగత సత్కారాలు, వసతి సౌకర్యాలను పర్యవేక్షిస్తుంది. తొమ్మిది మంది సభ్యులున్న వేదిక కమిటీ మినిట్‌ టు మినట్‌ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. అలాగే మీడియా, సాంస్కృతిక కమిటీకి పరకాల నేతృత్వం వహించనున్నారు.