1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (12:02 IST)

రాజధానిపై ప్రకటన వాయిదా: అష్టమి, నవమి కావడంతో గురువారం..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనే విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చేయాల్సిన ప్రకటన వాయిదా పడింది. మంగళవారం మంచి రోజు కాకపోవడంతో చంద్రబాబు తన ప్రకటన చేసే తేదీని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మంగళవారం అష్టమి, బుధవారం నవమి కావడంతో ఈ రెండు రోజులు మంచివి కావని బాబు భావిస్తున్నారు. దీంతో ఎల్లుండి గురువారం దశమి రోజు రాజధాని ఎక్కడ అనే విషయంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు ప్రకటన చేసే తేదీ వాయిదా పడిన విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్రువీకరించారు. రాజధానిపై పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే చంద్రబాబు ప్రటన చేస్తారని యనమల స్పష్టం చేశారు. 
 
కాగా విజయవాడకు సమీపంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను (హెచ్ఒడిలను) విజయవాడకు తరలిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
 
శివరామకృష్ణన్ కమిటీ రాజధాని విషయంలో చేసిన సూచనలను, చేసిన వ్యాఖ్యలను పక్కకు పెట్టాలని సోమవారంనాటి సమావేశంలోనే మంత్రివర్గం తోసిపుచ్చింది. రాజధాని ఏర్పాటుపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించి, స్పష్టత ఇవ్వాలని పలువురు మంత్రులు మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీంతో రాజధాని ఎక్కడ అనే విషయంపై ప్రకటన చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
 
భూములు అందుబాటులో ఉంటే మంగళగిరి వద్ద, లేదంటే నూజివీడుకు సమీపంలో రాజధానిని ఏర్పాటు చేసుకుందామని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో చెప్పారు.