1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (12:25 IST)

తుళ్లూరు అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపండి : మంత్రి నారాయణ

తుళ్లూరు అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అదీ అక్రమ లే ఔట్లన్నీ ఒక్కరోజులోనే తొలగించాలని ఆయన అధికారులను కోరారు. గుంటూరు జిల్లా పరిధిలోని పలు రాజధాని గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని అనధికార లే అవుట్లను పరిశీలించారు. వైకుంఠపురం గ్రామంలో అనధికారికంగా వేసిన లే అవుట్లను పరిశీలించారు. 
 
పెద మద్దూరులో వాగు వెంబడి వేసిన వెంచర్‌ను పరిశీలించారు. అనంతరం, అమరావతి చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో వేసిన సుమారు 40 లే అవుట్లను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి రాళ్లు వేస్తుంటే ఎందుకు ఊరుకున్నారని తహసీల్దార్‌, వీఆర్వోలను ప్రశ్నించారు. 
 
గుంటూరు రోడ్డులో ఐదెకరాల్లో వేసిన వెంచర్‌ను పరిశీలించారు. మంత్రి సమక్షంలోనే, అందులోని గుడిసెను జేసీబీలతో అధికారులు తొలగించారు. నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని తాడికొండ మండలంలో 44; అమరావతి మండలంలో 87 అనధికార లే అవుట్లను గుర్తించారు. మొత్తం 131 లే అవుట్లను 250 ఎకరాల్లో వేసినట్లు గమనించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఒక్క రోజులోనే అనధికార లే అవుట్లను తొలగించి, యజమానులపై కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రజలను మోసం చేసే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. క్రీడ పరిధిలో ప్రభుత్వ అనుమతి పొందిన ప్లాట్‌ల వివరాలు అందుబాటులో ఉంచుతామని, వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాంటి వెంచర్లలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, ప్లాట్ల క్రయ విక్రయాలు నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు.