ఏపీ ఉద్యోగుల వేతనాలు తగ్గినట్టు ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మకు తెలియదట...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇలా ఉండాలి, ఇంత ఉండాలి అంటూ నిర్ణయించిన అధికారుల్లో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు. కానీ, ఆయనకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గినట్టు కనిపించడం లేదట. ఒకవేళ వేతనాలు తగ్గివుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. వేతనాలు తగ్గినట్టు మాకు చెబితే కదా తెలిసేది అంటూ సెలవిచ్చారు.
ఉద్యోగులు చేపట్టిన "ఛలో విజయవాడ" కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఏపీ ప్రభుత్వం పోలీసు బలాన్ని ప్రయోగించారు. కానీ, ఉద్యోగులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా విజయవాడ నగరంలో జన సునామీని తలపించారు. ఈ జనసంద్రాన్ని చూడగానే ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేల్కొని అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎస్ సమీర్ శర్మ కూడా పాల్గొన్నారు.
సీఎంతో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీతాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు జీతాలు ఎక్కడ తగ్గాయో చెప్పాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చెబితేనే కదా తెలిసేది అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పే స్లిప్‌లో 10 రకాల అంశాలు పొందుపరిచామని, అన్నింటిని పరిశీలిస్తే, జీతం పెరిగిన విషయం తెలుస్తుందన్నారు.
సందేహాలు ఉంటే పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చిచూసుకోవాలన్నారు. అలాగే, హెచ్ఆర్ఏ సమస్య ఉంటే ప్రభుత్వంతో సావధానంగా మాట్లాడాలని సమీర్ శర్మ సెలవిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో డీఏ ఇచ్చివుంటే, ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలివుండేవన్నారు. కానీ, ఏ ఒక్క ఉద్యోగి నష్టపోరాదని భావించి సానుకూల ధోరణితో ఆలోచన చేసి పీఆర్సీని ప్రకటించామన్నారు.