గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (15:08 IST)

తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టుగా ఏపీ అప్పులు వెలుగు చూస్తున్నాయి : సీఎం చంద్రబాబు

chandrababu naidu
తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, ఇవ్వాల్టి (జూన్ 26వ తేదీ శుక్రవారం) వరకు రాష్ట్ర మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శుక్రవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి, అందులోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు. అదేసమయంలో 58 శాతం జనాభా ఉంది. అక్కడి నుంచే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు.
 
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95 వేలుగా ఉంది. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.93,903. అదేసమయంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కి పెరిగింది. 2014లో వ్యవసాయం ఏపీలో 33 శాతం, తెలంగాణలో 19 శాతం ఉండేది. 2014లో పరిశ్రమలు ఏపీలో 23 శాతం ఉంటే, తెలంగాణలో 19 శాతం ఉన్నాయి. 2014లో సేవల రంగం ఏపీలో 44 శాతం ఉంటే, తెలంగాణలో 61 శాతానికి విస్తరించింది. ఒక్క హైదరాబాద్ వల్లనే సేవల రంగంలో రెండు రాష్ట్రాల మధ్య 17 శాతం తేడా నెలకొందన్నారు.
 
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు వ్యతిరేక విధానం అవలంబించారు. మేం కేటాయించిన 227 ఎకరాల భూములను ఉపసంహరించుకుని, పరిశ్రమలను తరిమేశారు. మా హయాంలో 5 లక్షల కోట్లతో పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. 20 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్‌లు ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశాం. కానీ వీళ్లు అధికారంలోకి వచ్చాక పన్నులు విపరీతంగా పెంచేశారు. విద్యుత్ చార్జీలు పెరిగాయి, ఆర్టీసీ చార్జీలు పెంచారు, ఇసుక రేట్లు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, చివరికి చెత్త మీద కూడా పన్ను విధించారని తెలిపారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజుకు రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు. ఇంకా కొన్ని లెక్కలు రావాల్సి ఉంది. తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టు అప్పులు బయటికొస్తున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336 పెరిగింది. మరోవైపు ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. మరి డీబీటీ అన్నారు కదా... ఎక్కడికి కొట్టుకుపోయింది? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? పేదవాడికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాలు చేయలేదన్న విషయం ఈ గణాంకాల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది" అంటూ చంద్రబాబు వివరించారు.