శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:52 IST)

అనాథ శవాన్ని మోసిన కాశీబుగ్గ మహిళా ఎస్‌ఐకు డీజీపీ ప్రశంస!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టరుగా శిరీష్ విధులు నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ఇటీవల ఓ యాచకుడు పొలాల్లో చనిపోయాడు. ఈ అనాథ శవాన్ని ఒకరిద్దరు స్థానికుల సహాయంతో ఆమె స్వయంగా మోసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్త వచ్చింది. 
 
పైగా, సోషల్ మీడియాలో శిరీషను నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు. నలువైపుల నుంచి ఆమెకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఎస్ఐ శిరీషను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అభినందించారు. 
 
తన కార్యాలయానికి శిరీషను ఆహ్వానించడమే కాదు, ఆమెకు ప్రశంసాపత్రం కూడా అందజేశారు. గౌరవ బ్యాడ్జిని కూడా తొడిగారు. ఇతర పోలీసులకు స్ఫూర్తిగా నిలిచావంటూ కొనియాడారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
 
కాగా, 13 ఏళ్ల ప్రాయంలోనే బాల్య వివాహం చేసుకుని నరకం చవిచూసిన శిరీష, ఆపై జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొని ఎస్సైగా ఉద్యోగం చేపట్టిన విషయం తెలుసుకున్న తర్వాత ప్రజల్లో ఆమెపై మరింత గౌరవం పెరిగింది.