ఏపీలో కొత్త జిల్లాల విభజన.. 28 దాటుతాయా? ఎక్కువగా ఉంటాయా?

andhra pradesh map
andhra pradesh map
సెల్వి| Last Updated: శనివారం, 18 జులై 2020 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల విభజన జరుగనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల హామీ మేరకు 25 జిల్లాలు వస్తాయా.. ఎక్కువగానే ఉంటాయా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే రెవెన్యూ శాఖ 28 జిల్లాలపైనే ఉండొచ్చని భావిస్తోంది. గిరిజన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సంక్లిష్ట తే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఫలితంగా 3 గిరిజన జిల్లాల ఏర్పాటు అనివార్యమవుతోందని తెలిపింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొంది. అందుకు కొన్ని కారణాలను ప్రధానంగా ప్రస్తావించింది. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు 2 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వాటిల్లోని మండ లాలను సమంగా రెవెన్యూ డివిజన్లకు పంపిణీ చేయాలి. ఇది జరగాలంటే తొలుత మండలాలు, ఆపై డివిజన్ల పునర్విభజన చేపట్టాలి.

రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజన ప్రభావం 35 డివిజన్లపై ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్నాక చివరగా 11 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 679 మండలాలున్నాయి. విభజన ప్రక్రియ కోసం 12 మండలాలను పునర్విభజించాలి.

ఇదిలావుంటే, ప్రస్తుతమున్న జిల్లాల్లో హెడ్‌క్వార్టర్ సుదూరంగా ఉందని, కొత్తగా ప్రతిపాదించే వాటిల్లో 9 జిల్లాల్లో ఈ సమస్య వస్తుందని రెవెన్యూశాఖ పేర్కొంది. అలాగే
అరకు, ఏలూరు లోక్‌సభ స్థానాలు భౌగోళికంగా చాలా పెద్దవి. పైగా రోడ్‌ నెట్‌వర్క్‌ సమస్య ఉంది. అరకు నియోజకవర్గాన్ని మూడు గిరిజన జిల్లాలు.. పార్వతీపురం, అరకు రంపచోడవరంగా విభజించవచ్చు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను
పార్వతీపురం జిల్లాగా చేయవచ్చు. విశాఖలోని అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలను అరకు జిల్లాగా చేయవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక
గిరిజన జిల్లాగా ఏర్పాటుచేయవచ్చు.

ఏలూరు నియోజకవర్గాన్ని రెండుగా విభజించాల్సి రావొచ్చు. పోలవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయవచ్చు. ఏలూరు నియోజకవర్గం పరిధిలోని మరో 6 నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక ఏలూరు జిల్లాగా చేయవచ్చు. ఈ లెక్కన కొత్త జిల్లాల సంఖ్య 28 దాటనుంది.

ఇకపోతే.. కొత్త జిల్లాలపై సీఎస్‌ నేతృత్వంలో కమిటీ నియామకాన్ని కేబినెట్‌ ఆమోదించింది. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టం-1974 ప్రకారం.. కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ ఇస్తారు. 30 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.దీనిపై మరింత చదవండి :