జూన్ 14న ఏపీ ఎంసెట్ పరీక్షా ఫలితాలు రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ 2023 పరీక్షా ఫలితాలను జే.ఎన్.టి.యు అనంతపూర్ ఈ నెల 14వ తేదీన విడుదల చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
ఈ ప్రవేశ పరీక్షల్లో భాగంగా, ఇంజనీరింగ్ పరీక్షలను మే 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. అలాగే ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలను 22, 23 తేదీల్లో నిర్వహించారు. ఈఏపీసెట్ పరీక్షలకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని మే నెల 24వ తేదీన విడుదల చేసిన విషయం తెల్సిందే. ప్రాథమిక ఆన్సర్ కీ పై మే 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీని కూడా విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.