గులకరాయి గురి తప్పింది.. ఫలించని జగన్ సానుభూతి నాటకం!
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార వైకాపాను ఓటర్లు ఉతికి ఆరేశారు. ప్రతిపక్ష టీడీపీ కూటమికి అధికారం కట్టబెట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో మళ్లీ లబ్దిపొందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తులు, సానుభూతి కోసం గులకరాయి దాడి, బటన్ నొక్కుడు ఇలా ఏ ఒక్కటీ పని చేయలేదు.
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీపై అభాండాలు మోపి... రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడికత్తి దాడి ఘటనను జగన్ అడ్డు పెట్టుకున్నారు. అదేతరహాలో ఈ దఫా కూడా గులకరాయి ఘటనను తెలపైకి తెచ్చారు. కానీ, గులకరాయి తప్పింది. తనపై హత్యాయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు. నుదుటిపై బ్యాండేజీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు.
అప్పట్లో దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావును బలి చేసినట్లుగానే.. ఈసారి బీసీ యువకుడు వేముల సతీష్‌ను బలిపశువు చేయాలని చూశారు. తనను చంపించేందుకు టీడీపీ నాయకులే అతనితో దాడి చేయించారంటూ నమ్మబలకాలని చూశారు. అయితే ఈసారి జగన్ కుతంత్రం పారలేదు. వాటిని జనం విశ్వసించలేదు. దీన్ని మరో కోడికత్తి 2.0 నాటకంగా భావించి జగన్‌కు జీవితంలో మరచిపోలేని గుణపాఠం చెప్పారు.
అంతేకాకుండా, గులకరాయి ఘటనలో గాయపడిన వెంటనే జగన్ ప్రచార వాహనంలోనే ప్రథమ చికిత్స చేయించుకుని తిరిగి బస్సు యాత్రను కొనసాగించారు. అదేరోజు రాత్రి విజయవాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేటప్పుడూ గాయానికి చిన్న బ్యాండేజ్ వేసుకుని వెళ్లారు. బయటకొచ్చేటప్పుడూ చిన్న ప్లాస్టర్‌తో కనిపించారు. రెండు రోజుల తర్వాత అదే గాయంపైన కొంచెం పెద్ద ప్లాస్టర్ వేసుకున్నారు.
ఆ తర్వాత దాని పరిమాణాన్ని కొద్దికొద్దీగా పెంచుకుంటూ వచ్చారు. దాదాపు 15 రోజులపాటు ఆ బ్యాండేజీతోనే బస్సు యాత్రలో పాల్గొంటూ సానుభూతి పొందాలని చూశారు. యాత్ర ముగిసిన వెంటనే ప్లాస్టర్ తీసేశారు. జగన్‌కు తగిలిన గులకరాయే తన కంటికి సైతం తగిలిందంటూ వైకాపా నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు అయితే కంటికి పెద్ద కట్టుకుని, దానిపై కళ్లద్దాలు పెట్టుకుని నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూసి జనం నవ్వుకున్నారు. చివరకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు.