శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (08:33 IST)

రోగి ప్రాణాలు నిలబెట్టేలా ఏపీ సర్కారు కీలక నిర్ణయం .. ఉచితంగా రూ.40 వేల ఇంజెక్షన్

heart stroke
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుండెపోటుకు గురైన రోగులకు మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే స్టెమి ప్రాజెక్టుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. గుండెపోటు సంభవించిన తొలి గంట ఎంతో కీలకం. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు కారణంగా జరిగే మరణాలను తగ్గించేందుకు ఐసీఎంఆర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్టెమి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. దీనిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.
 
రాష్ట్రంలో 38 లక్షల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాలు చాలా కీలకం కాబట్టి ఈ సమయంలో రోగికి అవసరమైన చికిత్సను అందించి ప్రాణాపాయం నుండి కాపాడటమే స్టెమి ముఖ్యోద్దేశం. ఇందుకుగాను గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం... సమీపంలోని పీహెచ్సీలలో ఇనిషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం... గోల్డెన్ అవర్‌లో ఇవ్వాల్సిన రూ.40 వేల ఇంజెక్షన్‌ను రోగికి ఉచితంగా అందించడం... తదనంతరం 100 కిలో మీటర్ల పరిధిలో క్యాథ్ ల్యాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పిటలు రోగిని తరలించి టెస్టులు, ఆపరేషన్స్ నిర్వహించడం స్టెమి కార్యక్రమంలో భాగం.
 
ఇప్పటికే గ్రామస్థాయి సిబ్బంది, వైద్యులకు శిక్షణ పూర్తయింది. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలు చేపట్టింది. రూ.120 కోట్లతో క్యాథ్ ల్యాబ్స్ నిర్మాణం చేపట్టింది. నాలుగు హబ్‌లను ఏర్పాటు చేసి చిత్తూరు, గుంటూరు, విశాఖ, కర్నూలు జిల్లాల పరిధిలో 61 హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు గుండెపోటుపై అవగాహన కల్పిస్తారు.