ఏలూరు మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఎన్నికలను నిర్వహించవద్దని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.
కాగా, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. అయితే, ఏడు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసే అంశంపై సరైన విధి విధానాలను పాటించలేదనీ, ఓటర్ల జాబితాను తయారు చేయలేదనీ, డివిజన్ల విభజన కూడా రిజర్వేషన్ కోటా ప్రకారం చేయలేంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి... ఎన్నికల నిర్వహణపై స్టే విధించారు. ఈ స్టేను హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది.