ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కో వైద్య కాలేజీ : మంత్రి రజనీ వెల్లడి
ఆంధ్రప్రదశ్ రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కో వైద్య కాలేజీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజనీ వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయన్నారు. వచ్చే నెలాఖరులోపు అన్ని వైద్య కాలేజీల నిర్మాణం పనులు ప్రారంభంకాబోతున్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య రంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో తీసుకెళ్లి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజని వెల్లడించారు. ఆమె రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్ ఏపీ వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ముఖ్యంగా, నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో బీసీలకు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాధాన్యతను సీఎం జగన్ ఇచ్చారన్నారు. బీసీలు ఎప్పటికీ జగన్ వెంటే ఉంటారని చెప్పారు. తెలంగాణాలో పుట్టిపెరిగిన రజనీ.. ఇపుడు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు.