నెల రోజులా... నోఛాన్స్.. త్రీడేస్‌లో కౌంటర్ వేయాల్సిందే : సర్కారుకు హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించేందుకు ఆర్డినెన్స్ ద్వారా పదవీ కాలాన్ని తగ్గించి, ఆయన స్థానంలో కొత్త ఎస్ఈసీని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్‌తో పాటు.. టీడీపీ తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై కౌంటర్ దాఖలుకు నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తమకు పిటిషన్లు కూడా అందలేదని ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నారు. రమేష్ కుమార్ పిటిషన్‌ను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం వాదిచింది.
మరోవైపు, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తరపున తరపున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరినవారిలో తమ పిటిషన్‌దారుడు కామినేని ఒకరని, ఆయన మాజీ మంత్రి అని జంధ్యాల రవిశంకర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు చెప్పింది.
అదేసమయంలో ప్రభుత్వం కోరినట్టుగా కౌంటర్ దాఖలుకు నెల రోజుల సమయం ఇవ్వడం కుదరదని, మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అంటే ఈ నెల 17వ తేదీలోగా దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.