కొత్త పీఆర్‌సీ జీవో లను నిలిపివేస్తూ, ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త పీఆర్‌సీ జీవోలను నిలిపివేస్తూ, హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఉద్యోగుల హెచ్.ఆర్.ఎ.లో కోత విధిస్తూ, కొత్త పి.ఆర్.సి.ని ప్రభుత్వం విడుదల చేసింది. దీనిన ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు హైకోర్టులో ఈ కొత్త జీవోను సవాలు చేశారు. దీనిపై కోర్టు స్పందించి, విచారణకు ఆదేశిస్తూ... పి.ఆర్.సి. జీవోలను నిలిపివేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే కొత్త జీవోల ఆధారంగా ట్రెజరీ ఉద్యోగులు కొత్త పీఆర్సీ జీతాలను ప్రోసెస్ చేయడానికి సహకరించటం లేదు. దీనితో ఆ జీవో ప్రకారం జీతాల ప్రాసెస్ చేయడానికి పే అండ్ అకౌంట్ ఆఫీస్ ( సీఎఫ్ఎంఎస్ ) వారికి బాధ్యతలను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పిఆర్సి సమస్యపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పిఆర్సి జీవోలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమకు మెరుగైన ఫిట్మెంట్ లభిస్తుందని ఆశించిన ఉద్యోగ సంఘాలకు నిరాశే మిగిలింది. కేవలం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించటంతోపాటు హెచ్ ఆర్ ఎ వంటి పలు ఇతర అలవెన్సులలో కోత విధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ ను 27 శాతానికి పెంచి ఇవ్వటం జరిగింది. కాని 11వ పిఆర్సి లో ఐఆర్ కన్నా తక్కువగా 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దానికితోడు సవాలక్ష మెలికలతో ఉద్యోగుల జీతభత్యాలలో కోతలు విధిస్తూ జీవోలు విడుదల చేశారు. ఐఆర్ కన్నా తక్కువగా ఇచ్చిన దాఖలాలు చరిత్రలో జరగలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికైనా ఉద్యమం తీవ్రతరం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మరోదఫా చర్చలు జరపాలి. కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు పలు న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సి ఉంది.