బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (13:54 IST)

ఏపీలో రూ.18 వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం

మౌలిక సదుపాయాల కల్పనకే ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద‌ని, అందు కోసం పంచ సూత్రాలతో ముందుకెళతామని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని తెలిపారు.

 
ప్రతి రవాణా మార్గం మరో మార్గంతో పూర్తి అనుసంధానం ఏపీ ప్రత్యేకత అని, అందుకే చౌకగా సరకు రవాణా ప్రణాళికతో ఏపీ దూసుకెళుతుంద‌న్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను గ్రామ స్థాయికి చేర్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని వివ‌రించారు. పీఎం గతిశక్తిపై కేంద్ర సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ నియ‌మించింద‌ని తెలిపారు. 
 
 
దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో "పీఎం గతిశక్తి"పై కేంద్రం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మంత్రి మేకపాటి  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో 18 వేల కోట్ల రూపాయ‌ల‌తో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణంపై కేంద్ర పీఎం గ‌తి శ‌క్తి అధికారుల‌తో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చ‌ర్చించారు. మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వసతులను పెంపొందించడంలో  ఏపీ మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని మంత్రి తెలిపారు. ఎయిర్ పోర్టులకు అనుసంధానంగా రోడ్లు, రైళ్ల మార్గాలను నిర్మించడం సహా పోర్టుల ద్వారా సముద్ర వాణిజ్య అనుసంధానంలో ఏపీకి తిరుగులేదన్నారు. మల్టీ మోడల్ కార్గో హబ్ లు, సహజ వాయువుల పంపిణీ విస్తరణ ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో ఏపీ దూసుకెళ్లడం ఖాయమన్నారు.
 
 
రూ.18వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్  భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను, 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.  విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ వంటి 3 పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లానూ కలుపుతూ యువతకు పెద్దయెత్తున ఉద్యోగవకాశాలతో పాటు రహదారులు, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ముందుకెళుతోందని మంత్రి వివరించారు.  
 
 
ప్రపంచ బ్యాంక్ 2018లో వెల్లడించిన ర్యాంకింగ్ లలో భారత్ లాజిస్టిక్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (ఎల్ పీఐ)లో 44వ స్థానంలో నిలవడం ప్రధాని మోదీ దార్శనికతకు నిదర్శనంగా మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. సరకు రవాణాకు అవుతున్న ఖర్చు అందరికీ తెలుసు. కానీ ఎగుమతులలో ప్రపంచ సగటు 8 శాతంతో పోలిస్తే భారతదేశం ఇప్పటికీ 14శాతం సగటు ఉండడానికి కారణం ఎగుమతులలో ఎవరికీ అందనంత ఎత్తులో భారతదేశం ఉండడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
 
ఈ స‌మావేశంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీ.కే సింగ్,  కేంద్ర రవాణ, రహదారుల శాఖ  కార్య‌దర్శి గిరిధర్ ఆరమనే, అదనపు కార్యదర్శి అమిత్ కుమార్ గోష్, కేంద్ర సరకు రవాణా ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్.ఆర్ బొమ్మై, పుదుచ్చేరి రాష్ట్ర సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్,  తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అండమాన్ నికోబర్ , ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్ష్యద్వీప్, మహారాష్ట్ర, పొదుచ్చేరి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు, ఏపీ నుంచి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఏడీసీ ఎండీ భరత్ రెడ్డి, విజయవాడ విమానాశ్రయం జీఎం తదితరులు పాల్గొన్నారు.