శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2017 (19:25 IST)

తొలి రోజే 6 ఒప్పందాలపై సంతకాలు... తెలుగులోనే బోర్డులు పెట్టిస్తా... మంత్రి అఖిలప్రియ

అమరావతి, తాను బాధ్యతలు స్వీకరించి తొలిరోజే ఆరు ఒప్పందాల(ఎంఓయు)పై సంతకాలు పెట్టనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, భాషా శాఖల మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. సాంస్కృతి సంస్థలకు ఆర

అమరావతి, తాను బాధ్యతలు స్వీకరించి తొలిరోజే ఆరు ఒప్పందాల(ఎంఓయు)పై సంతకాలు పెట్టనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, భాషా శాఖల మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. సాంస్కృతి సంస్థలకు ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించే ఫైల్ పైన తొలి సంతకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దీని ద్వారా 13 జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు ఆర్థిక సహాయం కోసం మీ సేవ ద్వారా దరకాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మొదటి రోజు ఇటువంటి ఫైల్ పైన సంతకం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. గుడ్ ఫ్రైడే, బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి కలసివచ్చిన మంచి రోజు తాను బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక్కడకు వచ్చే ముందు ఆళ్లగడ్డలోని తన తల్లిదండ్రులు శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిల ఘాట్‌ను సందర్శించి, వారి ఆశీర్వాదాలు పొంది వచ్చినట్లు తెలిపారు.
 
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అపారంగా అవకాశాలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. నాలుగు 5స్టార్ హోటళ్లతోపాటు మొత్తం ఆరు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు చెప్పారు. ఇవి జీటీఆర్, జీకేఆర్, మినర్వా, మాట్రిక్స్ 5స్టార్ హోటళ్లు, బాలాజీ రిసార్ట్స్, ఆర్డీ రిసార్ట్స్‌కు సంబంధించి ఒప్పందాలని వివరించారు. ఇంకా మరికొంతమంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చేవిధంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ వంటివాటిపై కూడా శ్రద్ధ వహిస్తామన్నారు. ఇప్పటికే టూరిజం శాఖ అధికారులు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారని, తనకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయని వాటన్నిటినీ త్వరలో ఆచరణలో పెడతామని తెలిపారు. పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశం పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ను దృష్టిలో పెట్టుకొని కష్టపడతానని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్రం మొత్తాన్ని 5 టూరిజం సర్క్యూట్లుగా విభజించినట్లు తెలిపారు.
 
విశాఖ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్కడ బీచ్ కూడా ఉన్నందున పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖ-అరకు మధ్య త్వరలో టూరిజం రైలు నడపనున్నట్లు తెలిపారు. పర్యాటకులు అరకు అందాలను ప్రయాణిస్తూనే వీక్షించేందుకు ఈ రైలులో రెండు గ్లాస్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తిరుపతి, శ్రీశైలం వంటి ఆలయాలను దృష్టిలో పెట్టుకొని టెంపుల్ టూరిజం అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిళంలో యాత్రికులకు కావలసిన సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) త్వరలో ఒక యాప్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా హోటళ్లు, రూమ్ లు, రేట్లు రూమ్ బుకింగ్స్, టూరిజం స్పాట్ వివరాలన్నీ తెలుసుకోవచ్చన్నారు.
 
తెలుగు భాషాభివృద్ధికి కృషి
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. తెలుగు భాషాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కూడా ఉపయోగించుకుంటామన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని భాషను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రభుత్వలో ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రైవేటు వ్యాపారాలకు సంబంధించిన బోర్డులు తెలుగులోనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అఖిల ప్రియ చెప్పారు.