శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 26 ఏప్రియల్ 2017 (22:04 IST)

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా... మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సచివాలయం 4 బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (ఏపీయుడబ్ల్యూజె) ప్రతినిధ

అమరావతి : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సచివాలయం 4 బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (ఏపీయుడబ్ల్యూజె) ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారితోపాటు రాజధాని అమరావతిలో పని చేసే జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని, రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని,  జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచాలని, హెల్త్ కార్డుల మంజూరుకు, ఆస్పత్రుల్లో సమస్యలు తలెత్తకుండా హెల్త్ కార్డుల అమలు పర్యవేక్షణకు ఒక కమిటీని, సంక్షేమ నిధి కమిటీని నియమించాలని, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చట్టబద్దత కల్పించాలని కోరారు. 
 
అలాగే జర్నలిస్టుల వేజ్ బోర్డు ఆదేశాలు అమలు చేయించాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కలిపి కమిషన్ ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాల్లో హైపవర్ కమిటీలు నియమించాలని, గ్రామీణ జర్నలిస్టులకు కూడా రైల్వే పాస్‌లు ఇవ్వాలని, చిన్న పత్రికల సమస్యలు పరిష్కరించాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీలో తమ ప్రతినిధికి కూడా అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ మంత్రిని కోరింది.
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందినవారికి గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయడానికి డేటా సేకరించవలసిందిగా ఆయా జిల్లాల హౌసింగ్ పీడీలను ఆదేశాలిచ్చామన్నారు. పట్టాలు లేనివారికి మంజూరు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటికే జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, త్వరలో మోడల్ కాలనీ నిర్మిస్తామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీయుడబ్ల్యూజె అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు చందు జనార్ధన్, ఉప ప్రధాన కార్యదర్శి కె.జయరాజ్ ఉన్నారు.
 
త్వరలో అన్ని యూనియన్ నేతలతో సమావేశం..
రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టు యూనియన్ నేతలతో త్వరలో ఒక  సమావేశం ఏర్పాటు చేస్తామని  సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఒక పూట కూర్చొని సమస్యలు అన్ని చర్చించుకుందామని తనను కలిసిన మరో యూనియన్, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జీ.ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్‌కు మంత్రి చెప్పారు.