శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (09:06 IST)

అరటి చెట్టుతో నిషిత్ వివాహం... 'ఏం చేస్తాం.. మన చేతిలో లేనిది'.. అంటూ మంత్రి నారాయణ

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు అరటి చెట్టుతో వివాహం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ మృతదేహాన్ని బుధవారం రాత్రి 7.30 గంటలకు నెల్లూరులోని నారాయణ వైద

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు అరటి చెట్టుతో వివాహం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ మృతదేహాన్ని బుధవారం రాత్రి 7.30 గంటలకు నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలోకి తీసుకురాగా, పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. గురువారం ఉదయం దహన సంస్కారాలు నిర్వహించారు. 
 
దహన సంస్కారాలు ప్రారంభంకాకముందు... 9.20 నిమిషాలకు నిషిత్ పార్థివ దేహాన్ని ఇంటికి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించి అరటి చెట్టుతో పెళ్లి చేశారు. పెళ్లి కానివారు చనిపోతే కర్మక్రియలు చేయాలంటే ఈ తంతు పూర్తి చేయాల్సి ఉంది. అందుకనే నిషిత మృతదేహానికి- అరటి చెట్టుకు వివాహం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు బోరున విలపించారు. 
 
ఆ తర్వాత 9.40 నిమిషాలకు పూలతో అలంకరించిన అంతిమయాత్ర శకటంలోకి మృతదేహాన్ని చేర్చారు. మంత్రి నారాయణ, నారా లోకేష్‌ ఆ శకటంలోనే పెన్న వరకు ప్రయాణించారు. ముత్తుకూరు రోడ్డు నుంచి హరనాథపురం సర్కిల్‌, మినీ బైపాస్‌ రోడ్డు మీదుగా పెన్నాతీరానికి అంతిమయాత్ర కొనసాగింది. ఆ శకటం వెనుక భారీగా వాహనాలు బారులు తీరాయి. గతంలో ప్రముఖులకు దహన సంస్కారాలు చేసిన చోటే నిషిత దహన సంస్కారాలు గావించడంతో పెన్నాతీరమంతా జనసముద్రంగా మారింది.
 
ఇదిలావుండగా, కుమారుడు చనిపోయినట్లు బుధవారం ఉదయం 6 గంటలకు లండన్‌లో ఉన్న మంత్రి నారాయణకు సమాచారం అందింది. అక్కడి నుంచి హుటాహుటిన రాత్రి 12 గంటలకు చెన్నై చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకల్లా కుమారుడి భౌతికకాయాన్ని ఉంచిన నెల్లూరులోని నారాయణ వైద్యకళాశాలకు వచ్చారు. 
 
భౌతికకాయం వద్ద 20 నిమిషాలపాటు మౌనంగా గడిపారు. ఎంతో మనోనిబ్బరంతో వ్యవహరించారు. బాధను దిగమింగుకుని ‘ఏం చేస్తాం.. మన చేతిలో లేనిది.. మనం చేయగలిగింది ఏమీ లేదు.. జరిగింది జరిగిపోయింది’ అంటూ కుటుంబ సభ్యులను, విద్యాసంస్థల ప్రతినిధులను ఓదార్చేందుకు ప్రయత్నించారు.