గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:44 IST)

సినిమా టిక్కెట్ల విక్రయంపై దుష్ప్రచారం మానుకోండి : మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల విక్రయం కూడా ప్రభుత్వం వెబ్ సైట్ ద్వారా జరుగనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. పైగా, చిత్రపరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. 
 
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై దుష్ప్రచారం తగదని హితవు పలికారు. ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. 
 
ఈ అంశంపై కమిటీలు వేశామని అధ్యయనం జరుగుతోందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తు్న్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.